
ఓయూ/ముషీరాబాద్ వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, కమిషన్ చైర్మన్ జనార్దర్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని పీడీఎస్ యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుండి లా కాలేజీ వరకు ఓయూ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జాతీయ నాయకుడు నాగేశ్వర్ రావు, రాష్ట్ర అద్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు వరుసగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జూనియర్ లైన్ మెన్, సింగరేణి వంటి ఉద్యోగాలు భర్తీ సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగినపుడే సీఎం స్పందించి ఉంటే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేవన్నారు. రాష్ట్రంలో ఉద్యాగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించలేకపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సుమంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్చేస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనూ స్టూడెంట్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఏం చేస్తున్నరు?
ఎనిమిదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఖాళీగా ఉన్న పోస్టులను 2014 నుంచి నుంచి భర్తీ చేయకుండా ఏం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ విమర్శించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి దశల వారీగా ఖాళీలను భర్తీ చేయకుండా ఈ ఏడాది 66 వేల పోస్టులకు అనుమతివ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. ఈ నేపథ్యంలో నియామకాలు నిరవధిక వాయిదా పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు వెంకటేశ్, అంజి తదితరులు పాల్గొన్నారు.