విద్యర్థుల ఆత్మహత్యలు.. స్పందించని సీఎం

విద్యర్థుల ఆత్మహత్యలు.. స్పందించని సీఎం

 

  •     ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్టూడెంట్ల ఆందోళన 
  •     అందరినీ పాస్​ చేయాలని ఇప్పటికే సర్కారుకు బోర్డు ప్రతిపాదన 
  •     ఏ నిర్ణయమూ ప్రకటించకుండా నాన్చుతున్న ప్రభుత్వం

ఇంటర్​ఫస్టియర్​లో ఫెయిలైనమని స్టూడెంట్లు​సచ్చిపోతున్నా.. రాష్ట్ర​సర్కారు సప్పుడుజేస్తలేదు. ఇప్పటికే ఐదుగురు స్టూడెంట్లు ​ప్రాణం తీసుకున్నరు. అయినా ప్రభుత్వం నోరుమెదపడం లేదు. అందరినీ పాస్​ చేయాలని ఇంటర్​ బోర్డు మూడు రోజుల క్రితం సర్కారుకు ప్రతిపాదన పంపినా.. ఏ నిర్ణయం తీసుకోకుండా సర్కారు నాన్చుతోంది. ఇంటర్​ బోర్డు తప్పిదాలతో గతంలో 27 మంది స్టూడెంట్స్​చనిపోయారు. ఇప్పుడు ఫస్టియర్​పాస్ ​పర్సంటేజీ పడిపోయి ఐదుగురి ప్రాణాలు పోయాయి. 


ఇంకా లక్షల మంది ఆందోళనలోనే ఉన్నారు. ఫెయిలైన స్టూడెంట్లను మినిమమ్ మార్కులతో పాస్ చేయాలని స్టూడెంట్ యూనియన్లతో పాటు పొలిటికల్ పార్టీల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేసీఆర్​ సర్కారు మాత్రం చలించడం లేదు. ఎడ్యుకేషన్ ​మినిస్టర్ నుంచి గాని, సీఎం నుంచి గాని ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఇటీవల రిలీజైన ఇంటర్ ఫస్టియర్​ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సెకండియర్ చదివే 4,59,242 మంది స్టూడెంట్లకు అక్టోబర్ లాస్ట్ వీక్​లో ప్రభుత్వం పరీక్షలు పెట్టింది. కాగా 2,35,230(51%) మంది స్టూడెంట్లు ఫెయిల్​అయ్యారు. నిరుడు కేవలం 23 రోజులే ఫిజికల్ క్లాసులు నడిచినయి. మిగిలిన రోజులన్నీ ఆన్​లైన్, టీవీ పాఠాలే. సర్కారు, గురుకుల, ప్రైవేటు కాలేజీల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్టూడెంట్లకు క్లాసులు వినేందుకు సరైన సౌలత్​లు లేవు. వివిధ కారణాలతో చాలామంది పాస్ కాలేదు. ఈ ఏడాది ఫెయిలైన స్టూడెంట్లను పాస్ చేయాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 

ఆత్మహత్యలు జరుగుతున్నా..
ఫెయిల్​ అయ్యామన్న బాధతో ఐదుగురు స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరో స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన జాహ్నవి రైలు కిందపడి చనిపోగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వరుణ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ధనుశ్ ​ఉరేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నందిని వారం రోజుల కింద పురుగుల మందు తాగి గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. తాజాగా వనపర్తి జిల్లాకు చెందిన అనిత ఫస్ట్​ ఇయర్​లో ఫెయిలయ్యాననే ఒత్తిడికి గురైంది. దీంతో బ్రెయిన్​లో బ్లడ్ క్లాటై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున స్ర్టోక్ వచ్చి మృతిచెందింది. మరోపక్క పాసైన చాలామంది స్టూడెంట్లు తమకు తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. స్టూడెంట్లను పాస్ చేయాలని కోరుతూ స్టూడెంట్‌‌‌‌ యూనియన్స్ వారం రోజుల నుంచి ఇంటర్ బోర్డుతో పాటు మినిస్టర్ క్యాంపు ఆఫీసునూ పలుమార్లు ముట్టడించాయి. జిల్లాల్లోనూ కలెక్టరేట్లు, డీఐఈవోల ఆఫీసుల ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

పాస్​ చేయడమే ప్రత్యామ్నాయం..
స్టూడెంట్ యూనియన్ల ఆందోళనలతో రిజల్ట్ డేటాతో పాటు ఆల్టర్నెట్ ప్రపోజల్స్ ను సీఎంవో అధికారులు ఇంటర్ బోర్డు నుంచి తీసుకున్నారు. దీంట్లో మినిమమ్ మార్కులతో ఫెయిలైన స్టూడెంట్లను పాస్ చేయాలని సర్కారుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది. ప్రస్తుతం సప్లిమెంటరీ, ఇప్రూవ్​మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో, ఇది తప్ప వేరే ఆల్టర్నేట్ లేదని బోర్డు అధికారులు చెప్తున్నారు. పరీక్ష రాసిన స్టూడెంట్లు ప్రస్తుతం సెకండియర్​లో కొనసాగుతుండటంతో, ఫైనల్ ఎగ్జామ్స్ రాసే టైమ్​లో ఈ బ్యాక్ లాగ్ ఎగ్జామ్స్​ప్రభావం తీవ్రంగా పడుతుందని స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు.