Anasuya Bharadwaj : వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. ఏకంగా 42 మందిపై కేసు నమోదు!

Anasuya Bharadwaj : వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన అనసూయ..  ఏకంగా 42 మందిపై కేసు నమోదు!

టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అశ్లీల దాడులు, లైంగిక దూషణలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై ఆమె గట్టి పోరాటానికి దిగారు.  లేటెస్ట్ గా ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

అసలు ఏం జరిగింది?

అనసూయ ఫిర్యాదు ప్రకారం.. ఈ వివాదానికి బీజం 2025 డిసెంబర్ 22న పడింది. ఒక బహిరంగ కార్యక్రమంలో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరుసటి రోజు (డిసెంబర్ 23), మీడియా ప్రతినిధులు ఈ విషయంపై అనసూయ స్పందన కోరగా.. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు, నచ్చిన దుస్తులు ధరించే హక్కుకు మద్దతుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో తనపై మూకుమ్మడి దాడికి కారణమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది..

42మందిపై ఫిర్యాదు?

ప్రారంభంలో కొద్దిమందిపైనే ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన 22 పేజీల FIRలో నిందితుల సంఖ్య విస్తుగొలుపుతోంది. మొత్తం 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.. వీరిలో ప్రముఖ వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, అడ్వకేట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నారని తెలుస్తోంది.  వారిలో ప్రధానంగా బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, విజయలక్ష్మి, పావని,శేఖర్ బాషా , రజిని వీరితో పాటు అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేసిన పలువురు మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానెళ్లపై కూడా కేసులు నమోదయ్యాయి. 

అనసూయ తన ఫిర్యాదులో కేవలం దూషణల గురించి మాత్రమే కాకుండా, ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న తీరుపై కూడా ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించడం, అసభ్య పదజాలంతో లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి తన ఫోటోలను మార్చి అశ్లీలంగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

పోలీసుల స్పందన

అనసూయ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి 12న అధికారికంగా కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ వేదికగా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేధింపులకు గురైన సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, వాటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. అనసూయ చేస్తున్న ఈ పోరాటం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ఏమైనా అనే హక్కు ఎవరికీ లేదు అని ఆమె మద్దతుదారులు అంటుంటే, మరికొందరు ఆమె వ్యాఖ్యలనే తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా, ఆన్‌లైన్ వేధింపులపై ఒక సెలబ్రిటీ ఇంత భారీ స్థాయిలో ఫిర్యాదు చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.