మార్పుకోసం సర్కారు మూడు పాలసీలు

మార్పుకోసం సర్కారు మూడు పాలసీలు

హైదరాబాద్‌‌, వెలుగు:రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు మూడు విధానాలను అనుసరించాలని సీఎం కేసీఆర్​ అధికారులకు సూచించారు. ‘తెలంగాణ రూరల్‌‌ పాలసీ, తెలంగాణ అర్బన్‌‌ పాలసీ, తెలంగాణ రెవెన్యూ పాలసీ’ అనే మూడింటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. జనం ఎదుర్కొంటున్న పలు సమస్యల నుంచి ఉపశమనం లభించే రీతిలో రూరల్‌‌ (గ్రామీణ) విధానం, లంచాలు ఇచ్చే అవసరం ఎంత మాత్రం రాకుండా ఉండేలా రెవెన్యూ విధానం, అవినీతి జీరో స్థాయికి చేరుకునేలా అర్బన్‌‌ (పట్టణ) విధానం ఉండాలని చెప్పారు. బుధవారం సీఎం కేసీఆర్​‘కొత్త మున్సిపల్‌‌ చట్టం పురోగతి, అందులో చేర్చాల్సిన అంశాలు, చట్టంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఎలా ఉండాలి’ అన్న అంశాలపై ప్రగతిభవన్​లో సమీక్షించారు. రాష్ట్ర సాధనలో స్థిరమైన ప్రయాణం చేసి అనుకున్నది సాధించామని.. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చట్టం రూపకల్పన ఆషామాషీగా జరగొద్దు..

ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త మున్సిపల్​ చట్టం ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్​ సూచించారు. ‘‘అన్నింటి కంటే పెద్ద సమస్యలైన మంచినీళ్లు, సాగునీరు, కరెంట్‌‌ సమస్యను అధిగమించాం. ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించాం. కచ్చితంగా గ్రామాల పరిస్థితి బాగుపడాలని అనుకున్నం. పటిష్ట చట్టం తెచ్చినం. గ్రామాల అభివృద్ధి సాగుతోంది. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు చూడబోతున్నం. అటు గ్రామీణ తెలంగాణలో ఎన్నికల్లో గెలిచినం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి దీవించారు. అన్ని రకాల సంక్షేమం చేపట్టినం. ఇంకా వాళ్ల రుణం తీర్చుకోవడానికి గుణాత్మకమైన మార్పు తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. చేతనైనంత మార్పు తెస్తం. అవినీతిని అరికట్టే దిశగా కొత్త మున్సిపల్​ చట్టం రావాలి. ఉత్తమ విధానాల వల్ల ప్రజలు బాగుపడాలె. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే.. ఆ స్ఫూర్తితోనే కొత్త మున్సిపల్‌‌ చట్టం ఉండాలె. చట్టం రూపకల్పన ఆషామాషీగా జరగొద్దు..” అని స్పష్టం చేశారు. కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్‌‌ కమిషనర్లకు ఓరియంటేషన్‌‌ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌‌.నర్సింగరావు, మున్సిపల్‌‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌‌ కుమార్‌‌, కామారెడ్డి కలెక్టర్‌‌ ఎన్‌‌.సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌‌ రావు, మున్సిపల్‌‌ శాఖ కమిషనర్‌‌ శ్రీదేవి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌‌, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌‌ రెడ్డి, మున్సిపల్‌‌ మాజీ అధికారి డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.