
- ప్రజల దృష్టి మళ్లించేందుకేనన్న బీజేపీ
- కేసీఆర్ మెడిసిన్‌కు కాలం చెల్లిందన్న కాంగ్రెస్
హైదరాబాద్, వెలుగు:జాతీయ పార్టీ పెడుదామని టీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ చేసిన చర్చలు.. అన్ని రాజకీయ పార్టీల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఆయన ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలూ ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికపై వేచి చూసే ధోరణిని అనుసరించాలని, అప్పటివరకు ఎవరూ కామెంట్ చేయొద్దని పార్టీ లీడర్లకు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చిన గులాబీ బాస్..సడన్‌గా కొత్త పార్టీ ఏర్పాటును ముందుకు తీసుకురావటం తాజా చర్చకు తెరలేపింది. దీనిపై వివిధ పార్టీలు తలో తీరుగా స్పందించాయి. ఫామ్‌హౌస్‌లో కూర్చొని కేసీఆర్ ఏవేవో కలలు కంటున్నారని, అవన్నీ కల్లలుగానే మిగిలిపోతాయని బీజేపీ నేతలు అన్నారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ పార్టీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. కేసీఆర్ మెడిసిన్‌కు కాలం చెల్లిపోయిందని,బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే జాతీయ పార్టీ అంటూ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు మాత్రం కేసీఆర్‌ను దేశ్ కీ నేతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.దేశానికి తమ పార్టీ అధినేత దారి చూపుతారని,బీజేపీని గద్దె దించుతారని వాళ్లలో కొందరు ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీని గద్దె దించాలనే ఎజెండాతో పక్క రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ మూడేండ్ల నుంచి భేటీ అవుతున్నారు. ఆయన చేపట్టిన రాష్ట్రాల టూర్లు, వడ్ల కొనుగోళ్లపై ఢిల్లీలో చేసిన ఆందోళనకు టీఆర్ఎస్ ఆశించినట్లుగా ఇతర పార్టీల నేతల నుంచి మద్దతు రాలేదు.అప్పటికప్పుడు పర్యటనలు ప్రకటించి,ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతల్ని కలిసి వచ్చాక కేసీఆర్ చెప్పే మాటలకు, ఆయా రాష్ట్రాల నేతలు చేసే వ్యాఖ్యలకు పొంతనలేని సందర్భాలు కూడా ఉన్నాయి. దేశంలో ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ గురించి మాట్లాడామని ఆయనంటే, కాదు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం గురించి మాత్రమే మాట్లాడమంటూ అవతలి వారనడాన్ని ప్రత్యర్థి పార్టీలు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో జాతీయ స్థాయిలో ఆయన కొత్త పార్టీ పెడితే.. ఇప్పటికిప్పుడు ఎందరు కలిసి వస్తారు? ఎవరు సహకరిస్తారనే అనుమానాలు టీఆర్ఎస్ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి.బీజేపీకి గట్టి పోటీనిచ్చేలా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటవుతాయా? ఒకవేళ అయితే దానికి ఎవరు నేతృత్వం వహిస్తారు? అన్ని ప్రాంతీయ పార్టీలు, చిన్నపాటి జాతీయ పార్టీలు ఒక్కరి మాట వినే పరిస్థితి ఉందా? ఈ ప్రశ్నలన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే అన్నది రాజకీయ నిపుణుల మాట! బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నిక ఏకాభిప్రాయం కోసం ఇతర పార్టీలతో చర్చించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గేకు సూచనలు చేశారు. ఈ పరిస్థితుల్లో తాను వెనుకబడినట్టు ఉండొద్దనుకున్నారో,ఏమో.. కేసీఆర్ ఉన్నట్టుండి జాతీయ పార్టీ ప్రతిపాదనను తిరిగి ముందుకు తోశారనిపిస్తోంది.రాష్ట్రంలో తన పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉందనుకున్నపుడు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనునుకున్నపుడు.. ఇలా జాతీయ రాజకీయాల గురించి గొంతు పెంచడం, జనం దృష్టి మళ్లించి రాష్ట్రంలో తన పరిస్థితి మెరుగు పరచుకొని.. అన్నీ మరచిపోవడం ఆయనకు మామూలే అన్న రాజకీయ వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.దేశంలో బీజేపీయేతర,కాంగ్రేసేతర రాజకీయ పార్టీలు కూటమి కట్టడం,తక్కువ టైంలోనే విడిపోవడం కొత్త కాదు. ప్రజాదరణ,నాయకత్వ వివాదం ప్రతిసారీ సమస్యగానే ఉంటోంది.ఇప్పుడదే అంశం కేసీఆర్ ఎత్తులకు అడ్డంకి కాదనే గ్యారెంటీ ఏమీ లేదు.ఆయన ప్రతిపాదనలు మీడియాలో రాగానే రకరకాల స్పందనలు మొదలయ్యాయి.
జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కలిసి:టీఆర్‌ఎస్
కేసీఆర్‌ను దేశ్ కీ నేతగా చూపించే ప్రయత్నాలను టీఆర్ఎస్ ఇప్పటికే ముమ్మరం చేసింది. కేసీఆర్ కనుసన్నల్లో 15 రాష్ట్రాలు ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.పల్లె ప్రగతితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు మంత్రులు కూడా దానిపై స్పందించారు. జాతీయ స్థాయిలో పలు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.కేసీఆర్ పార్టీ పెట్టి కేంద్రంలో బీజేపీని గద్దె దించి తీరుతారని పలువురు టీఆర్ఎస్ లీడర్లు అన్నారు.
పార్టీ పేరు ఖరారు.. జెండాకు రూపకల్పన!
ఈ నెల 19న లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి, అందులో జాతీయ పార్టీ పై చర్చిద్దామని టీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ తన రూట్ మ్యాప్‌ను వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరున ఆయన ఢిల్లీలో అధికారికంగా జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని చర్చ జరుగుతున్నది. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరు ఖరారైందని, రిజిస్టర్ చేయటంతో పాటు జెండాకు రూపకల్పన జరుగుతున్నదని టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. వచ్చే నెల 2న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈలోపే జాతీయ పార్టీ ప్రకటన చేస్తే పొలిటికల్‌గా అందరి దృష్టిని టీఆర్ఎస్ ఆకర్షించే
అవకాశముందని గులాబీ నేతలు అంటున్నారు.
జగన్‌నూ కలుపుకొని పోవాలి:సీపీఐ నారాయణ
కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.‘‘కేసీఆర్ ఢిల్లీకి మకాం మార్చి పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తానంటే మంచిదే.కేంద్రంలో బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా ఉంది. దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటి తరఫున ఒక్క అభ్యర్థిని నిలబెడితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని అభిప్రాయపడ్డారు.కేసీఆర్ కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచే దిశగా రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి ఉందని,అది సాధ్యం కాకపోతే పార్టీ ఏర్పాటు చేసి కూడా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.‘‘జాతీయ పార్టీ ఏర్పాటుపై తన మిత్రుడు జగన్‌తో కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు.జగన్‌ను కూడా కేసీఆర్ కలుపుకొని పోవాలి” అని నారాయణ అన్నారు.
మమత మీటింగ్‌కు కేసీఆర్ వెళ్తరా?
రాష్ట్రపతి ఎలక్షన్ షెడ్యూలు వెలువడటంతో జాతీయ పార్టీలు అటువైపు ఫోకస్ చేస్తున్నాయి.అభ్యర్థి ఎంపిక, ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ,కాంగ్రెస్ తలోదిక్కుగా సన్నద్ధమయ్యాయి.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పలు రాష్ట్రాల సీఎంలు,ప్రతిపక్ష నేతలతో మంతనాలు జరుపుతున్నారు.15న ఢిల్లీలో మీటింగ్‌కు రావాలని 22 మంది లీడర్లను ఆమె ఆహ్వానించారు.గతంలో మమతను కలిసి మద్దతు కోరిన కేసీఆర్..ఇప్పుడు ఢిల్లీ మీటింగ్‌కు వెళ్తారా? అనేది ఆసక్తి రేపుతున్నది. ఆ మీటింగ్‌కు వెళ్తే... మమతా టీమ్‌లో కేసీఆర్ చేరినట్లే అవుతుందనే వాదనలున్నాయి.మమత మీటింగ్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉంటుందని,రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని, అందుకే కొత్త పార్టీ సన్నాహాలు మొదలయ్యాయనే చర్చ నేతల్లో జరుగుతున్నది.