- కొత్తగా రిజిస్టర్ అయ్యేవాటికే వర్తింపు
- ఆటోలు, ట్రాక్టర్లకు మినహాయింపు
- బైక్‌కు రూ.2 వేలు.. కార్లకు రూ.5 వేలు
- అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై ‘రోడ్ సేఫ్టీ’ సెస్ అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ సెస్ విధిస్తున్నామని, ఇది కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, లైట్ మోటార్ వెహికల్స్ (కార్లు)కు రూ.5 వేలు, హెవీ వెహికల్స్‌కు రూ.10 వేల చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు. ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ సెస్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.
గూడ్స్ బండ్లకు లైఫ్ ట్యాక్స్..
ఇప్పటివరకు ఫోర్ వీలర్, తేలికపాటి గూడ్స్ వాహనాలకు క్వార్టర్లీ పన్ను విధానం ఉండేదని, నిపుణులతో చర్చించిన తర్వాత దీన్ని మార్చామని మంత్రి తెలిపారు. ఇకపై కొత్తగా రిజిస్టర్ అయ్యే గూడ్స్ వాహనాలపై ఒకేసారి ‘లైఫ్ ట్యాక్స్’ విధిస్తామని.. దీన్ని 7.5 శాతంగా నిర్ణయించామని వెల్లడించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన ‘వాహన సారథి’ పోర్టల్‌లో చేరలేదని పొన్నం విమర్శించారు.
దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు చేరినా తెలంగాణ దూరంగా ఉండిపోయిందని, తాము అధికారంలోకి రాగానే అందులో చేరామని చెప్పారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలోనూ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు.
15 ఏండ్లు దాటితే స్క్రాపే..
కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత వాహనాల విషయంలో కఠినంగా ఉంటామని.. 15 ఏండ్లు దాటిన వాహనాలు స్క్రాప్ పాలసీ కిందకు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ 300 దాటిందని.. అందుకే రూ.వెయ్యి కోట్ల ఆదాయం పోయినా సరే ఈవీ పాలసీని తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఈ నెల1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రుల చేత రోడ్ సేఫ్టీ అఫిడవిట్లు రాయిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలుంటే.. కేవలం వెయ్యి మందే రవాణా శాఖ అధికారులు ఉన్నారని వివరించారు. ప్రతీ బండిని చెక్ చేయడం సాధ్యం కాదని, ఎవరికి వారు రూల్స్ పాటించాలని సూచించారు.
టూవీలర్లపై ట్యాక్స్ అన్యాయం: మహేశ్వర్ రెడ్డి
టూవీలర్లపై ట్యాక్స్ వేయడం అన్యాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ట్యాక్స్ లు, ఆర్టీసీ చార్జీలు పెంచారని.. తాజాగా మళ్లీ ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. రోడ్ సెఫ్టీ ట్యాక్స్ ఎంత వసూలు అవుతోంది? ఎంత ఖర్చు చేశారనే వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెంచిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ.. రూ.2వేల నుంచి రూ.10వేలకు పెంచడం సరికాదన్నారు. ట్యాక్స్‌ల భారం ఏటా రూ.270 కోట్లు వాహనదారులపై పడుతుందన్నారు. జీఎస్టీ తగ్గడంతో ప్రజలు వాహనాలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని.. ఈ ట్యాక్సులతో వారంతా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొయినుద్దీన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వసూలయ్యే ట్యాక్స్‌లో సగం ఇక్కడే ఖర్చు చేయాలని కోరారు.
