వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్​ రివ్యూ

వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్​ రివ్యూ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై దృష్టిసారించాలన్నారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నందున కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సీఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు సీఎం ఆదేశాలిచ్చారు.  వర్షాలు, వరదలపై సీఎం బుధవారం ప్రగతి భవన్​లో రివ్యూ చేశారు. నిర్మల్, ఇతర వరద ముంపునకు గురవుతున్న పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్​ శాఖ స్పెషల్​ సీఎస్​ అరవింద్ కుమార్ ను సీఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి  ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్  ఆదేశించారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు రక్షణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్నందున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని కేసీఆర్​ ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితి, చెరువులకు గండ్లు పడడంపై వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తోనూ సీఎం సమీక్షించారు. 

కరెంటు సప్లైకు అంతరాయం కలగరాదు

వర్షాల వల్ల కరెంట్​ సప్లైకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని కేసీఆర్​సూచించారు. విద్యుత్  ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీ లు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్ లకు ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను బట్టి అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్న నేపథ్యంలో వరదనీరు చేరుకోవడంతో నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ  మురళీధర్ రావును ఆదేశించారు. రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఫైనాన్స్​స్పెషల్ సీఎస్​ రామ కృష్ణారావును సీఎం ఆదేశించారు. పరిస్థితులు చక్కబడేవరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.