రెండో విడత గొర్రెల పంపిణీకి సీఎం ఆరోసారి ఆదేశం

V6 Velugu Posted on Jul 20, 2021

హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కుల వృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై ప్రగతి భవన్‌‌లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ.5 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. రెండో విడత పంపిణీ కోసం మరో రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. అందుకు  కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.  రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ఆదేశించారు. 

‘తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతోంది. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి.. తెలంగాణలోని బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి చేస్తోంది. దీని ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతూ, సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 

Tagged Telangana, bc, CM KCR, talasani srinivas yadav, Distribution of Sheeps

Latest Videos

Subscribe Now

More News