
జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి.. వారికి రైతుబంధు కూడా వర్తింపచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న లబ్ధిదారులకు సైతం.. రాష్ట్రంలోని మిగతా రైతులకు అందిస్తున్న మాదిరిగానే రైతుబంధు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి, పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లోనే రైతుబంధును జమ చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా పోడు పట్టాలు అందుకునే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థికశాఖకు అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
జులైలో ‘గృహలక్ష్మి’ పథకం
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను త్వరగా తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జులైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు.
ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత జాగల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సాయం చేయనున్నది. ఈ ఏడాది జులై నుంచి పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.