జాతీయ నేతలకు కేసీఆర్‌‌ ఫోన్‌‌

జాతీయ నేతలకు కేసీఆర్‌‌ ఫోన్‌‌
  • రైతు సంఘాలు, ట్రేడ్‌‌ యూనియన్‌‌ నేతలకూ పిలుపు
  • అందరికీ ప్రగతి భవన్‌‌లో లంచ్‌‌
  • జాతీయ పార్టీ కోసం హిందీ, ఇంగ్లిష్‌‌ భాషల్లో సొంత చానళ్లు?

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ను జాతీయ పార్టీగా మార్చే సమావేశానికి రావాలని పలు ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్‌‌ ఆహ్వానించారు. దసరా రోజు తెలంగాణ భవన్‌‌లో నిర్వహించే టీఆర్‌‌ఎస్‌‌ విస్తృత స్థాయి సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం పలు పార్టీల నేతలతో కేసీఆర్‌‌ ఫోన్‌‌లో మాట్లాడారని టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు చెప్పారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, గుజరాత్‌‌ మాజీ సీఎం శంకర్‌‌ సింగ్‌‌ వాఘేలా, బీహార్‌‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌‌, రైతు సంఘాల నేత రాకేశ్‌‌ టికాయత్‌‌, సినీ నటుడు ప్రకాశ్‌‌ రాజ్‌‌కు ఫోన్‌‌ చేసినట్టుగా తెలిసింది. వీరితో పాటు పలువురు రైతు సంఘాల నాయకులు, ట్రేడ్‌‌ యూనియన్‌‌ నాయకులకూ కేసీఆర్‌‌ ఫోన్‌‌ చేసి పార్టీ ప్రకటనకు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.

కొత్త పార్టీపై మధ్యాహ్నం ప్రకటన

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌‌ఎస్‌‌ రాష్ట్ర కార్యవర్గం, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌‌ చైర్మన్‌‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌‌కు చేరుకోవాలని ప్రగతి భవన్‌‌ నుంచి ఫోన్లు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ సంయుక్త సమావేశం ప్రారంభమవుతుందని, 283 మంది సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో టీఆర్‌‌ఎస్‌‌ పేరు మార్చుతూ తీర్మానం చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్‌‌ జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని చెప్పారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు ప్రగతి భవన్‌‌లో లంచ్‌‌ ఉంటుందని, అందరితో కలిసి కేసీఆర్‌‌ లంచ్‌‌ చేస్తారని పేర్కొన్నారు. లంచ్‌‌ తర్వాతే అందరు హైదరాబాద్‌‌ నుంచి స్వస్థలాలకు వెళ్లాలని చెప్పారని వివరించారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌‌ వెలువడటంతో దసరా రోజు పార్టీ జనరల్‌‌ బాడీ మీటింగ్‌‌ ఉంటుందా లేదా అనే సందిగ్ధత నెలకొనడంతో దీనిపై కేసీఆర్‌‌ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌‌, దసరా పండుగ ప్రభావం ఈ సమావేశంపై ఉండదని, అందరూ నిర్దేశిత సమయానికి తెలంగాణ భవన్‌‌కు చేరుకోవాలని చెప్పారు.

చానళ్ల ఏర్పాటుపై ఢిల్లీ జర్నలిస్టుతో చర్చలు

కేసీఆర్‌‌ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ ప్రచారం కోసం రెండు నేషనల్‌‌ చానళ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. హిందీ, ఇంగ్లీష్‌‌ భాషల్లో రెండు చానళ్లు తీసుకువస్తారని, ఢిల్లీ కేంద్రంగా ఇవి ఆపరేషన్‌‌లోకి వస్తాయని సమాచారం. జాతీయ చానళ్ల ఏర్పాటుపై ఢిల్లీలో పనిచేసే ప్రముఖ జర్నలిస్టులతో టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్యులు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. జాతీయ చానళ్లు ఏర్పాటు చేసే వరకు టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ చానల్‌‌ టీ న్యూస్‌‌ ప్రసారాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ములాయం ఎట్లున్నరు?

హెల్త్ కండిషన్​పై కేసీఆర్ ఆరా

ఉత్తరప్రదేశ్‌‌ మాజీ సీఎం, ఎంపీ ములాయం సింగ్‌‌ యాదవ్‌‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్‌‌ సమీక్షించారు. ములాయం కొడుకు అఖిలేశ్‌‌ యాదవ్‌‌కు కేసీఆర్‌‌ సోమవారం ఫోన్‌‌ చేశారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని అఖిలేశ్‌‌ వివరించారు. దసరా తర్వాత వచ్చి మూలయంను పరామర్శిస్తానని కేసీఆర్‌‌ తెలిపారు.