
రాష్ట్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో భాగంగా పద్దులపై జరిగిన చర్చలో.. ఆయన మాట్లాడారు.
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని.. ఆరేళ్లలో దివాలా తీసిన రాష్ట్రంగా మార్చారనీ… పూర్తి దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు మల్లు భట్టి విక్రమార్క. ఓటాన్ బడ్జెట్ తో పోల్చితే రూ.36వేల కోట్ల కోత పెట్టారన్నారు. దీనికి ఘాటుగా స్పందించారు సీఎం కేసీఆర్.
ఆరేళ్ల కిందట అసలు రాష్ట్రమే లేదనీ.. అప్పుడు మిగులు బడ్జెట్ ఎక్కడిదని అన్నారు కేసీఆర్. అలా మాట్లాడితే పెద్ద జోక్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు బడ్జెట్ అంచనాలకు, తయారీకే సరైన ప్రాతిపదికలే లేవన్నారు. అది కూడా బడ్జెట్ లో తాము వివరించామన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండేదనేది అసమంజసం, సత్యదూరమైన మాట అన్నారు. రకరకాలుగా మాట్లాడి.. సభను, సభ్యులను, ప్రజలను మిస్ లీడ్ చేయడం కరెక్ట్ కాదన్నారు సీఎం కేసీఆర్.
“ఇలాంటి బడ్జెట్ ఎప్పుడూ రాలేదు అనేది కరెక్టే. ఎందుకంటే.. దేశంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎకానమీ స్లో డౌన్ అయిన పరిస్థితుల్లో ఇలాంటి బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. కేంద్రం కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత పెట్టింది. మన రాష్ట్రాన్ని మనం శపించికోవడం మంచిదికాదు.. రాష్ట్రాన్ని దివాలా తీయించామా మీరు చెప్పండి. ఎన్నో రాష్ట్రాల కంటే చాలా ఉత్తమమైన పద్ధతిలో ఉన్నాం. దేశంలో మొత్తం 28 రాష్ట్రాల్లో మనం ఏ ర్యాంక్ లో ఉన్నాం అనేది త్వరలోనే చెప్తాం. మా దగ్గర లెక్కలేదు అనేది ఏమీ లేదు. అబద్దాలు మాత్రం చెప్పొద్దు. అది మానుకోండి” అన్నారు సీఎం కేసీఆర్.