అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

అకాల వర్షాలతో తెలంగాణ రైతులు నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఈ క్రమంలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో పంట నష్టం అంచనా వేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు. 

 
అకాల వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కోతకొచ్చిన మక్క, వరి చేన్లు నేలకొరిగిపోగా.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న వడ్లు తడిసిపోయాయి. వాన నీటిలో కొట్టుకుపోయాయి. పక్వానికొచ్చిన మామిడి కాయలన్నీ రాలిపోయాయి. కొన్ని చోట్ల ఇండ్లు, చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. పిడుగులు పడి నలుగురు చనిపోయారు. మహబూబాబాద్, జగిత్యాల, గద్వాల, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి.