4న సీఎం పాలమూరు పర్యటన.. పోలీస్ యంత్రాంగం అలర్ట్​

4న సీఎం పాలమూరు పర్యటన.. పోలీస్ యంత్రాంగం అలర్ట్​
  • ఏడియాడనే ‘డబుల్’ ఇండ్లు.. పెండింగ్​లో  ప్రాజెక్టులు
  • సీఎంకు సమస్యలు విన్నవిస్తామంటున్న కిందిస్థాయి ఉద్యోగులు

మహబూబ్​నగర్​, వెలుగు: సీఎం కేసీఆర్​ఈ నెల 4న పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గత పర్యటనల్లో  ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే  మళ్లా వస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఆందోళనలకు రెడీ అవుతున్నారు. అలాగే కొన్నేండ్లుగా తమను పట్టించుకోవడం లేదని స్కూల్​స్వీపర్లు, వెట్టి చేయిస్తున్నారని ఆశావర్కర్లు, అంగన్​వాడీలు సీఎంను కలిసి విన్నవించేందుకు టైం ఇవ్వాలని అధికారులను అడుగుతున్నారు. దీంతో జిల్లా పోలీసులు అలర్ట్​ అయ్యారు. సీఎం టూర్​లో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నారు.  

డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు ఏమాయే?

తెలంగాణలో టీఆర్ఎస్ ​పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 లో సీఎం కేసీఆర్​ పాలమూరు బస్తీల్లో పర్యటించారు. ఇరుకు ఇండ్లల్లో ఉంటున్న ఇక్కడి పేదల పరిస్థితిని చూసి, అందరికీ డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. గృహ ప్రవేశాలకు తనను పిలిచి దావత్​ ఇయ్యాలని చెప్పారు. కానీ ఇంత వరకు పేదలకు ‘డబుల్’​ ఇండ్లను ఇవ్వలేదు. ఇంకా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణమే పూర్తి కాలేదు.  దాదాపు 20 వేల ఇండ్లను శాంక్షన్​చేయగా, అందులో 40 శాతం ఇండ్లు మాత్రమే పూర్తి అయ్యాయి.  అందులో 2వేల లోపు ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇంకా చాలా చోట్ల‘ డబుల్’ ఇండ్ల నిర్మాణం పిల్లర్ల కాడనే ఉంది. పంపిణీ చేసిన  ఇండ్లలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకొని ఇండ్లు కేటాయించారని విమర్శలున్నాయి. ఇండ్ల కేటాయింపులో సామాన్యుల నుంచి  డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టరేట్​లో నిర్వహించే  ప్రజావాణిలలో బాధితులు కలెక్టర్లకు కంప్లైంట్లు కూడా చేశారు.

పీఆర్ఎల్ఐ ఆగమాగం

తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్  ప్రాజెక్టుగా పాలమూరు– -రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంను ప్రభుత్వం చేపట్టింది. 2016లో మహబూబ్​నగర్​జిల్లా భూత్పూర్​ మండలం కర్వెన వద్ద ఈ స్కీంకు సీఎం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేయిస్తానని, ఏడాదిన్నరలోగా పాలమూరులో సాగునీరు పారించి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏడేండ్లు పూర్తవుతున్నా.. ఈ స్కీం పనులు ఇప్పటి వరకు 30 శాతం కూడా పూర్తి కాలేదు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్​, లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నా,  ఏడి పనులు ఆడనే పెండింగ్​లో ఉన్నాయి. దీనికితోడు కోయిల్​సాగర్​ ప్రాజెక్టు కాల్వల స్థాయిని పెంచేందుకు జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. మహాత్మా గాంధీ కల్వకుర్తి 
లిఫ్ట్​ఇరిగేషన్​, బీమా 1, 2 నెట్టెంపాడు పనులు కూడా పెండింగ్​లో ఉన్నాయి. వీటి పరిధిలో పిల్ల కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ పూర్తి కాలేదు. దీంతో నిర్ధేశించిన ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.

స్కూల్ ​స్వీపర్లు, ఆశా వర్కర్ల గోస

వారం కింద జడ్పీ ఆఫీస్​వద్ద స్కూల్​ స్వీపర్లు రెండు రోజులు ఆందోళన చేశారు. ఏళ్లుగా రూ.1,600 జీతాలు ఇస్తున్నారని, తమకు వేతనాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ నిరసనకు దిగారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారని,  టీబీ పేషంట్ల ఇండ్లకు వెళ్లి తెమడ తీసుకురావాలని, గ్రామాల్లో హెచ్ఐవీ బాధితులను గుర్తించాలని వారు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను ఇన్​వాల్వ్​చేస్తున్నారని  ఈ విషయాలన్నింటిపై సీఎంను కలిసి విన్నవిస్తామని 3 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్​ఆఫీసర్ల వద్దకు వెళ్లి సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని కోరారు. కానీ, ఇంత వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో వారు ఎలాగైన సీఎంను  కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు.