మహారాష్ట్రలోనూ ధరణి తెస్తం.. రైతులకు పెన్షన్​ ఇస్తం: కేసీఆర్

మహారాష్ట్రలోనూ ధరణి తెస్తం.. రైతులకు పెన్షన్​ ఇస్తం: కేసీఆర్
  • మహారాష్ట్రలోనూ ధరణి తెస్తం.. రైతులకు పెన్షన్​ ఇస్తం
  • ఇక్కడ రైతులు రక్తం కారే దాకా పాదయాత్ర చేసినా ఎవరూ పట్టించుకోలే
  • మా దగ్గర మొత్తం పంటను మేమే కొంటున్నం
  • అందుకు భయపడి ఇతర పార్టీలోళ్లు అడ్డంపొడుగు మాట్లాడుతున్నరని విమర్శ
  • సర్కోలిలో బహిరంగ సభ.. పండరీపూర్, తుల్జాపూర్​ఆలయాల్లో పూజలు

హైదరాబాద్, వెలుగు:  తాము ఏ పార్టీకీ, ఎవరికీ ‘బీ’ టీమ్​ కాదని బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​ అన్నారు. తమ రాజకీయ ప్రస్థానం ఇప్పుడిప్పుడే ప్రారంభించామని, మిగతా పార్టీలకు తమపై ఎందుకంత ఆక్రోశమని ఆయన ప్రశ్నించారు. ‘‘మేమంటే  భయమెందుకు? తొందరపాటుతో ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నరు? మమ్మల్ని ఏ పార్టీ కూడా వదలడం లేదు. బీజేపీకి ‘బీ’ టీమ్ అని కాంగ్రెస్​అంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్​ ఒక్కటేనని బీజేపీ చెప్తున్నది. మేము ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్​కాదు. రైతులు, దళితులు, బీసీలు, మైనార్టీల టీమ్​ మాది” అని అన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని సర్కోలిలో నిర్వహించిన సభలో  కేసీఆర్​ మాట్లాడారు. ఎన్సీపీ నేత భగీరథ్​ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్ఎస్​లో చేరారు. ఎన్నో పార్టీలు ఎన్నో రకాల నినాదాలు ఇచ్చాయని, ‘అబ్​కీ బార్ ​కిసాన్ ​సర్కార్’ నినాదంతో తమ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నదని కేసీఆర్​ చెప్పారు. 


దేశంలో 60 శాతానికి పైగా ఉన్న రైతులు, కార్మికులు తమ పార్టీకి మద్దతునిస్తున్నారని, అందుకే ఆయా పార్టీలు భయంతో అడ్డం పొడుగు మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు. ‘‘మేం తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాం.. దేశం మొత్తం మార్పు తేవడమే మా లక్ష్యం” అని చెప్పారు. 

మహారాష్ట్ర  రైతులకు పెన్షన్​ ఇస్తం

తెలంగాణలో రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజ్​చేసి రైతులకు కష్టం లేకుండా చేశామని కేసీఆర్ అన్నారు. దీంతో తమ రాష్ట్రంలో రైతులకు ఇబ్బందే లేకుండా పోయిందని చెప్పారు. తమకు అవకాశం ఇస్తే మహారాష్ట్రలోనూ ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజ్​చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే ఇక్కడి రైతులందరికీ పెన్షన్​ ఇస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ ఇక్కడా అమలు చేస్తామని అన్నారు. పండరీపూర్​లో భగీరథ్​ బాల్కేను బీఆర్ఎస్​ అభ్యర్థిగా గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవితో పాటు మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశముందని కేసీఆర్​ చెప్పారు.  కాగా, మంగళవారం ఉదయం షోలాపూర్ నుంచి కేసీఆర్, మంత్రులు, ఇతర నాయకులు పండరీపూర్ వెళ్లారు, విఠల్ రుక్మిణీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సర్కోలిలోని భగీరథ్​బాల్కే నివాసానికి వెళ్లారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొని మధ్యాహ్నం సోలాపూర్​కు తిరిగి వచ్చారు. అక్కడి నుంచి తుల్జాపూర్​లోని తుల్జాభవాని అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హైదరాబాద్​కు బయల్దేరారు. 

ALSO READ:గద్వాల్ టు భీమదేవరపల్లి..అంజి

రైతులు పండించిన  పంటంతా కొంటున్నం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన విధానం లేకపోవడంతోనే దేశంలో సాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తిందని కేసీఆర్​అన్నారు. ‘‘ఔరంగాబాద్​లో ఎనిమిది, షోలాపూర్​లో నాలుగు, అకోలాలో పది రోజులకోసారి నీళ్లు ఇస్తున్నరు. ముంబై, పుణెలోనూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులున్నయ్​. సమృద్ధిగా నీళ్లున్నా ఇన్ని తిప్పలు ఎందుకో చెప్పాలి? దేశంలో అమలవుతున్న జల విధానాన్ని పెకిలించి కొత్త విధానం తేవాలి. బాల్కే నాయకత్వంలో చంద్రబాగ్​నీటిని మంగళ్​వాడ్​కు తరలిస్తం” అని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు 50 ఏండ్లు కాంగ్రెస్​కు అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత ఎన్సీపీ, శివసేన, బీజేపీకి అవకాశం ఇచ్చారని.. వారిలో ఎవరైనా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారా అని కేసీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ టైంలోనే రైతులకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా ఇస్తూ ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు. రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. ఉల్లి రైతులు మద్దతు ధర కోసం నాసిక్​నుంచి ముంబై దాకా పాదయాత్ర చేస్తే వారి పాదాల నుంచి రక్తం కారుతున్నా పట్టించుకున్న వారే లేరని తెలిపారు.