గద్వాల్ టు భీమదేవరపల్లి..అంజి

గద్వాల్ టు భీమదేవరపల్లి..అంజి

నటుడిగా తెరపై కనిపించాలనేది అతని లక్ష్యం.  పదిహేనేళ్ల కష్టం తర్వాత లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. మరో వారంలో షూటింగ్ ఉండగా తండ్రి చనిపోయాడు. సినిమాలో క్యారెక్టర్ ప్రకారం జుట్టు, గుబురు గడ్డంతో కనిపించాలి. కానీ తండ్రి కర్మకాండల కోసం గుండు చేయించుకోవాలి. తన జీవిత లక్ష్యం ఓవైపు.. సాంప్రదాయాలు పట్టించుకోవా అనే సూటిపోటీ మాటలు మరోవైపు.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి.. ఫైనల్‌‌‌‌గా నటుడే గెలిచాడు.. అతనే అంజి వల్గమాన్. బలగం, పరేషాన్, ఇంటింటి రామాయణం లాంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించడంతో పాటు.. ఇటీవల విడుదలైన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు అంజి. ఈ చిత్రంలోని తన నటనకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ ‘గద్వాల్‌‌‌‌ సమీపంలోని జమ్మిచేడు మా ఊరు. 

చదువు అక్కడే పూర్తిచేశా. 2006లో అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా. నటన, సినిమా మేకింగ్ గురించి అవగాహన కోసం థియేటర్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌లో చేరి ఎన్నో నాటకాలు వేశా. అప్పుడే మహాత్మ, సారాయి వీర్రాజు లాంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశా. తర్వాత సినిమా అవకాశాల కోసం ఎన్నో ఆఫీసులు తిరిగాను. పరిచయాలు పెరిగాయి కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కలేదు. అయితే ‘మెయిల్‌‌‌‌’ చిత్రం కోసం ఇచ్చిన డెమో నా లైఫ్‌‌‌‌ను మార్చేసింది, నాకు అవకాశాలు తెచ్చిపెట్టింది. బలగం, పరేషాన్‌‌‌‌, ఇంటింటి రామాయణం చిత్రాల్లో నటించే చాన్స్‌‌‌‌లు వచ్చాయి. అదే సమయంలో ‘భీమదేవరపల్లి బ్రాంచి’లో లీడ్ రోల్ చేసే  అవకాశం లభించింది. ఏదో చిన్న క్యారెక్టర్ అనుకుని ఆడిషన్ ఇస్తే.. దర్శకుడు రమేష్‌‌‌‌ చెప్పాలకు బాగా నచ్చింది. 

తర్వాత కథ మొత్తం వినిపించి నువ్వే మెయిన్ లీడ్ అనడంతో షాకయ్యాను. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా కావడం, ఎన్నో నాటకాల్లో లీడ్ రోల్ చేసిన అనుభవం ఉండడంతో ఈజీగా ఆ క్యారెక్టర్ పోషించా. కరీంనగర్ జిల్లా మల్లాపూర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువభాగం షూటింగ్ జరిగింది. ఫస్ట్ హాఫ్‌‌‌‌లో కామెడీ, సెకెండాఫ్‌‌‌‌లో ఎమోషన్‌‌‌‌ ఉండే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ చేశా. ఇప్పటివరకూ ఎక్కువగా కామెడీ రోల్స్ చేసినప్పటికీ ఎలాంటి పాత్ర పోషించేందుకైనా రెడీగా ఉన్నా. తెలంగాణ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సినిమాలు వస్తుండడం, అందులోనూ కంటెంట్‌‌‌‌కి ప్రయారిటీ ఇస్తుండడంతో నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టులు వెలుగులోకి వస్తుండడం సంతోషంగా ఉంది.