అవార్డ్ విన్నింగ్ మూవీస్‌తో గుర్తింపును అందుకున్న డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన తాజా చిత్రం ‘కాక్రోచ్’. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటించారు. బి.బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణ నిర్మించారు. మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘విశాఖపట్నం, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్థుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను.
దీనికోసం అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులను కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. చిన్న పిల్లలు , సున్నిత మనస్కులు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని కోరుతున్నా’ అని అన్నారు. నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ ‘మా కాంబినేషన్‌లో రూపొందించిన మరో డిఫరెంట్ మూవీ ఇది. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుంది’ అని అన్నారు.
