నిజాంపేట, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేసేందుకు నోడల్ ఆఫీసర్ ను నియమిస్తామని చెప్పారు. ప్రజావాణికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఏదైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందించాలని అధికారులకు సూచించారు.
ప్రతీ దరఖాస్తును ఆన్లైన్ చేసి ఆయా దరఖాస్తులు ఏ అధికారి స్థాయిలో ఉన్నాయో తెలిపే సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో, పోలీసు పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్కు స్థల పరిశీలన చేశారు. ఆ స్థలంలో తహసీల్దార్ ఆఫీస్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ రమ్య శ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ లింగారెడ్డి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి ఉన్నారు.
ప్రజావాణికి 38 వినతులు
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 38 వినతులు వచ్చాయి. కలెక్టర్ ప్రావీణ్య ఆయా వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఆమెతో పాటు అడిషనల్కలెక్టర్ మాధురి, డిప్యూటీ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఆర్డీఓలు రాజేందర్, దేవుజ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ మొత్తం ఫిర్యాదుల్లో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
సిద్దిపేటలో 205 సమస్యలు
సిద్దిపేట టౌన్: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు, ఇతర అర్జీలు కలిపి మొత్తం 205 దరఖాస్తులను స్వీకరించారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీడీ కార్మికులకు కాంగ్రెస్ప్రభుత్వం రూ.4 వేల పింఛన్ అందిస్తానని చెప్పి మోసం చేసిందని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు మండిపడ్డారు. కలెక్టరేట్ ముందు బీఆర్టీయూ అనుబంధ సంస్థ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నర్సింలు, బీఆర్టీయూ రాంబాబు యాదవ్, నాయకులు అరవింద్, ఐలారెడ్డి, మోహన్ రెడ్డి, నర్సింగ్, శోభన్, శ్రీనివాస్, సంజీవులు, బీడీ టేకేదారులు, కార్మికులు పాల్గొన్నారు.
