మాకు న్యాయం చేయాలే..ఇందిరమ్మ ఇండ్లను కట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్

మాకు న్యాయం చేయాలే..ఇందిరమ్మ ఇండ్లను కట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్
  •     ఐటీడీఏ ముందు గిరిజనుల రిలే దీక్షలు

ఇంద్రవెల్లి(ఉట్నూర్),వెలుగు: ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు జులుం చలాయించడం సరికాదని, అటవిని సంరక్షిస్తున్న ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోలాం గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిందని, కానీ ఫారెస్ట్ అధికారులు కోర్ ఏరియా, బఫర్ జోన్ పేరిట ఇండ్లు కట్టనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చశారు. గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వసంతరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, టీఏజీఎస్ రాష్ట్ర నేత పూసం సచిన్, జిల్లా నేత ఉయిక విష్ణు, 13 గ్రామాల పటేళ్లు, కోలాం గిరిజనులు పాల్గొన్నారు.