నస్పూర్, వెలుగు: నిరుపేద లబ్ధిదారులు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం సరిగ్గా పంపిణీ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్యతో కలిసి విజిలెన్స్ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు చాతరాజుల దుర్గాప్రసాద్ తో కలిసి రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. రేషన్ డీలర్లు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. రేషన్ కార్డులో నుంచి చనిపోయినవారి వివరాలు తొలగించాలని, స్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అధికారులు పాల్గొన్నారు.
