సూడో జాతీయ వాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం

సూడో జాతీయ వాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం

దేశ రాజకీయాల్లో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజకీయాల గురించి చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానన్నారు. దేశంలో మంచి మార్పు తీసుకురావడం కోసం జరిగిన భేటీలో దేశాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. తాము అన్ని అంశాలపై ఏకాభిప్రాయంతో ఉన్నామన్న కేసీఆర్.. చట్టాల్లో చేయాల్సిన మార్పుల గురించి భేటీలో ప్రస్తావించినట్లు చెప్పారు.  రాబోయే రోజుల్లో కలిసి నడవాలని నిర్ణయించామని ఉద్ధవ్ థాక్రేను త్వరలో తెలంగాణకు రావాల్సిందిగా ఆహ్వానించానన్నారు కేసీఆర్.

తెలంగాణ, మహారాష్ట్రల మధ్య మంచి సంబధాలున్నాయని కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాలు 1,000 కిలోమీటర్ల సరిహద్దును పంచుకున్నందున తామిద్దరం  సోదరుల్లాంటి వాళ్ళమన్న ముఖ్యమంత్రి.. మహా ప్రభుత్వ సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం జరిగిందని అన్నారు. మహారాష్ట్ర నుంచి ఏ పోరాటం మొదలు పెట్టినా సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని కేసీఆర్తీ వ్రంగా ఖండించారు. కేంద్రం ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 

సూడో జాతీయవాదాన్నిఅడ్డుకోవడమే తమ లక్ష్యమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. హిందుత్వవాదం సూడో జాతీయ వాదం కాదన్న ఉద్ధవ్.. రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరించే తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు.