తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కి ఒక ప్రత్యేకత ఉంది : సీఎం కేసీఆర్

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కి ఒక ప్రత్యేకత ఉంది : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక  ప్రత్యేకత ఉందన్నారు సీఎం కేసీఆర్. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్ లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టిందని..  అందులో భాగంగా హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్, 17వ తేదీ,1948 నాడు సువిశాల భారతదేశంలో అంతర్భాగమైందని చెప్పారు. ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం పోయి.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం తెలంగాణ ప్రభుత్వం సముచితంగా భావించిందని.. అందుకే, సెప్టెంబర్ 17న  రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు.  నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయని సీఎం కేసీఆర్ చెప్పారు. న్యాయం కోసం, ధర్మం కోసం,రాజ్యాంగ హక్కుల సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి తెలంగాణ సమాజం నిలిచిందన్నారు. ఆసేతు హిమాచల పర్యంతం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని చెప్పారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల కృషి వల్ల దేశం ఏకీకృతమైందని గుర్తు చేశారు.

ALSO READ: ప్రముఖ రచయిత్రి, నవీన్‌ పట్నాయక్‌ సోదరి గీతా మెహతా కన్నుమూత

తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకూ హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందిందని సీఎం కేసీఆర్ చెప్పారు.  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజానీకానికీ జరిగిన తీరని అన్యాయాలను, అక్రమాలను, సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమబావుటాఎగురవేశామన్నారు. ఆ మహోద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర తనకు అందించిన గొప్ప అవకావం అన్నారు. స్వరాష్ర్టంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం ప్రజలు తన భుజస్కంధాలపైనే మోపారని చెప్పారు.

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటినుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్నివర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత, సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావద్దేశం ప్రశంసిస్తున్నదని చెప్పారు.