నా దీక్షతోనే మలుపు..నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణపై కేంద్రం ప్రకటన: కేసీఆర్

నా దీక్షతోనే మలుపు..నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణపై కేంద్రం ప్రకటన: కేసీఆర్
  • ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి
  • 600 -700 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినం
  • ఇంకా ఎవరైనా ఉంటే సాయం చేస్తం
  • అమెరికాలో ఒబామా ప్రెసిడెంట్ అయినట్టే.. ఇక్కడా దళితులు గద్దెనెక్కాలె
  • ఇతర రాష్ట్రాల వాళ్లు వస్తే ముందుగా అమరజ్యోతి వద్ద నివాళి అర్పించాలి
  • అమరుల స్మారక చిహ్నం ప్రారంభించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: తన నిరాహార దీక్షతోనే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, ఆ తర్వాతనే కేంద్రం నుంచి ప్రకటన వచ్చిందని సీఎం కేసీఆర్​అన్నారు. ఎందరో విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని.. వారి ప్రాణాలకు వెల కట్టలేమన్నారు. ఇప్పటి దాకా 600–700 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఇంటికి రూ.10 లక్షలు చొప్పున ఇచ్చామని తెలిపారు. ఉన్నంతలో కొంత సాయం చేసుకున్నామని.. ఇంకా ఎవరైనా ఉంటే సాయం చేస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అమరవీరులపై రూపొందించిన డాక్యుమెంటరీ చూసిన తరువాత అమరజ్యోతిని ప్రారంభించి.. కొందరు అమరుల కుటుంబాలను సన్మానించారు.

ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా ఏం చేసినా బాధ కలుగలేదని.. ఉద్యమంలో బలిదానాలు జరగడమే కలచివేసిందన్నారు. ‘‘ఒక రక్తపు చుక్క కింద కారకుండా.. ఎవరికి నష్టం కలగకుండా.. ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నం. కానీ ఆ ఘట్టం కాస్త.. నా నిరాహార దీక్ష సందర్భంగా మలుపు తీసుకుంది. ఆ మలుపులో చాలామంది పిల్లలు దారుణమైన పద్ధతిలో బలయ్యారు’’ అని అన్నారు. ఇది ఆ అమరవీరుల స్మారకం.. తెలంగాణ అమర జ్యోతి అని తెలిపారు. మొత్తం అమరవీరుల ఫొటోలు పెట్టి ప్రత్యేకంగా అలంకరిస్తామన్నారు. జలదృశ్యం దగ్గర కడితే అమరుల ఆత్మశాంతిస్తుందని ఇక్కడే కట్టినట్లు చెప్పారు. అమరుల జ్యోతికి.. సెక్రటేరియెట్​కు మధ్య తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని తెలిపారు.

విద్యార్థులు.. ఉద్యోగులను ఉద్యమంలోకి రానివ్వొద్దు అనుకున్నం

ముందు దశలో విద్యార్థులు, ఉద్యోగులను ఉద్యమంలోకి రానివ్వవద్దని అనుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యమ కాలంలో కొందరు రాజకీయ నాయకులు ముసుగువీరులుగా ఉన్నారన్నారు. మరికొందరు మనస్సులో ఉన్న రాలేకపోవడం.. రకరకాల బలహీనతలు, ప్రలోభాలు ఉండేనన్నారు. ఉద్యమం అంటే ఆందోళనలు చేయాలి.. బస్సులను తగలపెట్టాలి.. బంద్​లకు పిలుపివ్వాలని అని చెప్పడాన్ని తాను విభేదించానని కేసీఆర్ తెలిపారు. అది సాధ్యం కాదని చెప్పి.. చాలామందిని కన్విన్స్ చేస్తూ ముందుకుపోయినట్లు చెప్పారు. 58 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్థిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జీవోలు, ఉద్యోగులు, టీచర్లు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఉన్నారన్నారు. 

విద్యార్థి శ్రేణులు అన్ని స్థాయిల్లో కూడా చాలా అద్భతంగా ముందుకొచ్చి పనిచేశారన్నారు. ఉద్యమం ప్రారంభించే మొదట్లో నా మిత్రుడు వి.ప్రకాశ్, మధుసూదనచారి, తాను పిడికెడు మందితో ముందుకు వెళ్లామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని.. అనేక మంది అనేక రూపాల్లో డబ్బులకో, పదవులకో.. రాజకీయ, పోలీసుల ఒత్తిడికో దేనికో ఒకదానికి కాంప్రమైజ్ అయి నీరుగారిపోయరన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ ప్రతి శనివారం పూర్తిస్థాయి నిరాహారంగా ఉపవాసం ఉండేవారన్నారు. కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా రకరకాల పేర్ల మీద ఉద్యమానికి జీవం పోశాయి. తెలంగాణ మహాసభ అని.. తెలంగాణ జనసభ అని వాళ్ల ప్రయత్నాలు వాళ్లు కొనసాగించారన్నారు.

దేశం ముఖంపై ఒక మచ్చ ఉంది

దేశం ముఖం మీద ఒక మచ్చ ఉందని.. దళితులను ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ విధంగా పెడతామన్నారు. అమెరికాలో నల్లజాతీయులు అని ఎవరిని అవమానించారో.. అలాంటి చోట బరాక్​ ఒబామాను అధ్యక్షుడిని చేసి వారి పాపాన్ని కడుకున్నారని.. అది మన దేశంలో కూడా రావాలన్నారు.

ప్రపంచంలో ఏ నేతపై ఇంత దాడి జరిగి ఉండదు

తనపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చుడో..  కేసీఆర్‌‌‌‌ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపానని.. తన నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయని.. పార్లమెంట్‌‌‌‌లో పెప్పర్‌‌‌‌ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారన్నారు. ఇతర రాష్ట్రాల వారు వస్తే ముందుగా అమరులకు నివాళి అర్పించాలన్నారు. అమరుల జ్యోతి దగ్గర శ్రద్ధాంజలి ఘటించిన తరువాత కార్యక్రమాలు జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇక ఉద్యమ, అమరవీరుల బలిదానాలు కళ్లకు కట్టే విధంగా చరిత్రను పూర్తిగా పెడుతామన్నారు. 1969 కావొచ్చు.. ఉద్యమ ఘట్టాలు, త్యాగాలు ఎవరి దగ్గర ఉన్నా పంపించాలని.. వాటిని స్మారక కేంద్రంలో పెడుతామన్నారు. కొందరు మూర్ఖులు అక్కడక్కడ ఉంటారని.. తత్తరపాటు, తొందరపాటు ఎక్కువ ఉంటదన్నారు. ఏమాయే అమరుల స్థూపం అని మాట్లాడరన్నారు. చాలా యూనిక్​గా కట్టాలని.. ఇతర దేశాల్లో స్టడీ చేసి కట్టినట్లు తెలిపారు. ఈ రోజ రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు అని.. ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామన్నారు. అమరుల స్మారకం సంతోషం ఒక పాలు అయితే విషాదం రెండు పాలు ఉన్నదన్నారు.