బీజేపీ ముక్త భారత్ కోసం ప్రజలంతా పోరాడాలి

బీజేపీ ముక్త భారత్ కోసం ప్రజలంతా పోరాడాలి

గుజరాత్ మోడల్ అని చెప్పి మోడీ దేశ ప్రజలను దగా చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాలు, స్మశానాలపై పన్నులేస్తుందన్నారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతోందని ఆరోపించారు. బీజేపీ అవినీతి గద్దలు జనాన్ని దోచుకుంటున్నాయని మండిపడ్డారు. 2024లో  బీజేపీ ప్రభుత్వం పోయి..రైతు ప్రభుత్వం వస్తుందని చెప్పారు. బీజేపీ ముక్త భారత్ కోసం ప్రజలంతా పోరాడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 

జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా.?
26 రాష్ట్రాల నుంచి తనను కలవడానికి రైతుల సంఘాల నాయకులు వచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారని చెప్పారు.  ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని చెప్పారన్నారు. ఈ సందర్భంగా తనను జాతీయ రాజకీయాల్లోకి రావావాలని వారు ఆహ్వానించినట్లు కేసీఆర్ వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా అంటూ పెద్దపల్లి జిల్లా ప్రజలను కేసీఆర్ అడిగారు. 

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు..
తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలవడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. 24 గంటల ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి ఏ పథకాలు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ అమలవడం లేదని చెప్పారు. పెదలు, రైతులు, ప్రజలు, మహిళల గురించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అద్భుతమైన రీతిలో ముందుకు పోతున్నామని..సింగరేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరికాయన్నారు. కార్మికులకు బోనస్ ఇస్తున్నామని..రామగుండం ను కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇవన్నీ తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమయ్యాయని సీఎం వెల్లడించారు. 
 

మోడీకే మీటర్ పెడదాం..
ఢిల్లీ నుంచి వచ్చే దొంగల బూట్లు మోసే నాయకులు రాష్ట్రంలో ఉన్నారని..వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. బాగుపడే సమయంలో దుర్మార్గులు వచ్చి మతం పేరుతో కొట్లాడుకోండ్రి అని చెప్తున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవంతో ఉందామా..లేక ఢిల్లీ దొంగలకు గులాములు అవుదామని అని కేసీఆర్ ప్రశ్నించారు. మోసపోతే గోసపడుతామని..అభివృద్ధిలో వెనక్కుపోతామన్నారు. రైతులు, రైతు కూలీలు, ప్రజలకు మేలు చేసే పథకాలను అమలు చేస్తుంటే..అవి బందు చేయాలని..ఉచితాలు ఇవ్వొద్దని అంటున్నారని కేసీఆర్ చెప్పారు. బోర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఎంత ఒత్తిడి చేసినా..బోర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు. మనందరం కలిసి మోడీకే మీటర్ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రజలు ఆలోచించాలి..
పెద్దపల్లి జిల్లా చైతన్యవంతమైన గడ్డ అని కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు, సింగరేణి కార్మికులు బీజేపీపై కన్నెర్ర చేయాలన్నారు. తెలంగాణ ప్రజలు ,మేథావులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ కోరారు.

నిధులు మంజూరు..
పెద్దపల్లి జిల్లా అవుతుందని..రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అవుతుందని ఏనాడైనా అనుకున్నారా..అని  కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కు కోటీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు తలా కోటి చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. మంథనీలోని గ్రామ పంచాయితీలకు రూ. 10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.