కొత్త నాయకుడి కోసం దేశం ఎదురు చూస్తున్నది : సీఎం కేసీఆర్

కొత్త నాయకుడి కోసం దేశం ఎదురు చూస్తున్నది : సీఎం కేసీఆర్
  • కొత్త నాయకుడి కోసం దేశం ఎదురు చూస్తున్నది
  • దేశాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడుతా: సీఎం కేసీఆర్
  • రాజకీయాలను మార్చేందుకు నేషనల్​పాలిటిక్స్​లో ఎంట్రీ
  • అంచనాలకు మించి ప్రజాదరణ లభిస్తున్నది
  • రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవ్
  • డెవలప్​మెంట్​లో తెలంగాణ ముందుకు పోతుంటే.. దేశం వెనక్కి పోతున్నదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: “దేశం మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది. దేశాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడుతాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కొంచెం లేటైనా చివరికి న్యాయమే గెలుస్తుంది. డెవలప్ మెంట్ లో తెలంగాణ ముందుకు వెళుతుంటే.. దేశం వెనకకు పోతోంది. గతంలోలాగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు. వలస వెళ్లిన వాళ్లు తెలంగాణ ఏర్పాటు తర్వాత సొంతూళ్లకు తిరిగొస్తున్నరు. నిరుద్యోగ సమస్యను మెల్లమెల్లగా తొలగించుకుంటున్నాం” అని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని అన్నారు. “ఈ రోజు దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నది. ఈ విషయం మనందరికీ తెలుసు. మనం మన దేశాన్ని కాపాడుకోవాలని పెద్దలు, యువతను కోరుతున్నా. చిన్న చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి.  మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉంటాం.

ఇది తాత్కాలిక దశ. ఈ సమయంలో ఒనగూరేదేం ఉండదు. చివరికి  న్యాయమే గెలుస్తుంది. ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార, సంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించిన వారు అంతమవుతారు. కానీ, దేశం ఎన్నటికీ నిలిచే ఉంటుంది.  నా మాటలపై నమ్మకం ఉంచండి. సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలి. దేశాన్ని రక్షించుకోవాలని  విన్నవిస్తున్నాను. ప్రస్తుతమున్న దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకు నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను. మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాదరణ లభిస్తున్నది” అని సీఎం కేసీఆర్ అన్నారు.

బీఆర్ఎస్​లో చేరిన మహారాష్ట్ర నేతలు

మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు బీఆర్ఎస్​లో చేరారు. బుధవారం ప్రగతిభవన్​లో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాసిక్​కు చెందిన డాక్టర్లు లక్ష్మణ్ సబలే, బిలాల్​షేక్, అడ్వొకేట్ ఎన్​కే మహాజన్, నాయకులు సందీప్ దేవ్రే, సూర్యవంశీ, అమిత్ విజయ్ ప్రకాశ్, సోమ్​నాథ్ బోరడే, తుకారాం తాండడే, బాలాసాహెబ్ రేక్, బబ్లూ సయ్యద్, చాంద్​పఠాన్, శివాజీరావ్ ఘోడకే తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.