కేసీఆర్​వి పచ్చి అబద్ధాలు.. దొంగ మాటలు

కేసీఆర్​వి పచ్చి అబద్ధాలు.. దొంగ మాటలు
  • ఆయనకు చిన్న మెదడు చితికింది: సంజయ్​
  • మోడీ, అమిత్​షాపై నోరు జారితే ఖబడ్దార్
  • కృష్ణా జలాల్లో వాటా రాకపోవడానికి 
  • ముఖ్యమంత్రే బాధ్యుడని ఆగ్రహం

జనగామ/హైదరాబాద్​, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై  సీఎం కేసీఆర్​ పచ్చి అబద్ధాలు, దొంగ మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కృష్ణా జలాల్లో వాటా రాకపోవడానికి ముమ్మాటికీ కేసీఆరే బాధ్యుడు. తన గజకర్ణ గోకర్ణ, టక్కు టమార విద్యలతో తిమ్మిని బమ్మిని చేసి మునుగోడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నడు. కానీ జనం నమ్మే స్థితిలో లేరు” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై మునుగోడు సభలో సీఎం కేసీఆర్​చేసిన కామెంట్లను బండి సంజయ్​ ఒక ప్రకటనలో ఖండించారు. ‘‘భయంతో కేసీఆర్ చిన్న మెదడు చితికి.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షాపై అవాకులు చవాకులు పేలుతున్నడు. తీరు మార్చుకోవాలి” అని హెచ్చరించారు.  మునుగోడు సభలో కేసీఆర్‌ గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం స్పష్టంగా కనిపించాయన్నారు. మునుగోడుతోనే టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైనట్టుగా కేసీఆర్ ప్రసంగంలోనే వినిపించిందని పేర్కొన్నారు. బ్లాక్​ మెయిల్​ రాజకీయాలతో ఓట్లు పడవనే విషయం కేసీఆర్​ గుర్తుంచుకోవాలని బండి సంజయ్​ అన్నారు. ‘‘తెలంగాణకు కృష్ణాలో 575 టీఎంసీలు దక్కాల్సి ఉండగా 299 టీఎంసీల వాటాకే ఒప్పుకున్న దుర్మార్గుడు కేసీఆర్‌. ఈ విషయాన్ని నేను పలుమార్లు ఆధారాలతో నిరూపించిన. మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని కేసీఆర్‌ సంతకాలు చేసిండు. ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పేరుతో కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుపోతున్నా కేసీఆర్‌ పట్టించుకోకుండా ఫాం హౌస్‌లో కుంభకర్ణుడిలా పడుకున్నడు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందని పదేపదే హెచ్చరించినా పట్టించుకోలేదు” అని మండిపడ్డారు. 

ఈడీ అంటే కేసీఆర్​కు వణుకు

ఈడీ అంటే కేసీఆర్​ వణికిపోతున్నారని బండి సంజయ్​ విమర్శించారు. ‘‘వ్యవసాయ మోటార్లకు కేంద్రం మీటర్లు పెడుతుందని పదేపదే రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేయాలని కేసీఆర్ చూస్తున్నడు. ఇదే విషయాన్ని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డడు. రైతులకు వాస్తవాలు తెలుసు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై కేసీఆర్​ మోయలేని భారాన్ని మోపుతున్నడు” అని అన్నారు.

డిస్కంలకు బకాయిలు ఎందుకు కడ్తలే? 

రాష్ట్రంలో మరోసారి కరెంట్​ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్​ కుట్రకు తెరలేపారని బండి సంజయ్​ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ తీరువల్ల విద్యుత్ సంస్థల్లో రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయినయ్​.  దీంతో కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి వచ్చింది. ఇదే జరిగితే రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే ప్రమాదం ఉంది” అని తెలిపారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్​ బస పాయింట్​ వద్ద మీడియాతో సంజయ్​ మాట్లాడారు. కేసీఆర్​ అనాలోచిత నిర్ణయాల వల్లే కరెంట్​ సంక్షోభం అని, ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు భారీ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు సుమారు 20 వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయేతర అవసరాలకు వాడే కరెంటు బిల్లులను టంచన్​గా వసూలు చేస్తున్న సర్కారు డిస్కంలకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. ఉచిత సంక్షేమ పథకాలకు ప్రధాని మోడీ వ్యతిరేకం కానే కాదని ఆయన అన్నారు. దమ్ముంటే డిస్కంల బకాయిలపై వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలని సీఎం కేసీఆర్​ను డిమాండ్​ చేశారు.  ఎంతసేపూ కేంద్రాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా కేసీఆర్​ ఉన్నారని బండి సంజయ్​ అన్నారు. పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్​ వాళ్లకు ప్రజలు ఓటెయ్యరని అన్నారు. కేసీఆర్​కు మునుగోడు ప్రజలు కర్రుకాల్చి వాతపెడ్తారని పేర్కొన్నారు. ‘‘ఎంగిలి మెతుకుల కోసం కేసీఆర్ వద్ద కమ్యూనిస్టులు మోకరిల్లిన్రు. ఆ పార్టీ కార్యకర్తలే ఆ లీడర్లను ఛీ కొడుతున్నరు. నా పాదయాత్రలో కమ్యూనిస్టు కార్యకర్తలు వచ్చి మద్దతిస్తున్నరు” అని ఆయన తెలిపారు. 

భూ నిర్వాసితులు దీక్ష చేస్తున్నా పట్టదా?

చర్లగూడెం, కృష్ణరాయునిపల్లి ప్రాజెక్టుల్లో భూ నిర్వాసితులు ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఊసెత్తని కేసీఆర్.. రైతులకు తానేదో గొప్ప మేలు చేస్తున్నట్లుగా నటించడం సిగ్గుచేటని బండి సంజయ్​ మండిపడ్డారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడి రోదిస్తుంటే వాళ్ల గురించి ఒక్క మాట కూడా సభలో కేసీఆర్​ చెప్పలేదని ఆయన అన్నారు. మునుగోడుతో పాటు రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలందరికీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో జరిగిన అన్యాయానికి కేసీఆరే కారణమని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం మినహా కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మంచలేదని, ఆయన మూర్ఖత్వం వల్ల వేల కోట్ల రూపాయలు గోదాట్లో కలిసి పోయాయని అన్నారు. ఉప ఎన్నిక రాగానే ఎనిమిదేండ్ల  నిర్లక్ష్యాన్ని వదిలి కేసీఆర్ పరిగెత్తుకుంటూ మునుగోడుకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు దిశగా బీజేపీని గెలిపించాలని, అప్పుడే కేసీఆర్ అహంకారం పూర్తిగా తగ్గుతుందని అన్నారు. కేసీఆర్​ మాయమాటలను జనం నమ్మరని మునుగోడు ఎన్నికల్లో  బీజేపీని గెలుపు ఖాయమని బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు.