ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ ఎనలేని కృషి

ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ ఎనలేని కృషి

హైదరాబాద్: స్వయం పాలనలో తెలంగాణా  చారిత్రక ప్రతిపత్తికీ, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర  ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం గోల్కండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం ప్రజలనుద్దేశించిం మాట్లాడారు  వారసత్వం, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాలనే దృక్పథంతో  యాదా్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా  పునర్నిర్మించడం పట్ల భక్తులు, సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాకతీయు కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం మనందరికీ గర్వకారణమని..ఈ గుర్తింపు వెనక ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉందన్నారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. తెలుగు నేలపై మొదటిసారి విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రిక వారసత్వ కట్టడంగా రామప్ప పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని తెలిపారు.

 ట్రీ సిటీగా హైదరాబాద్
 తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతం పైగా పెరిగిందని..  ట్రీ సిటీగా హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని 63 దేశాలలో భారత దేశం నుంచి ఈ ఘన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషమన్నారు. ఈ ఘనత ఆషామాషీగా రాలేదని... చెట్లను నాటడంలో, పోషించడంలో, విస్తరించడంలో ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ ప్రధాన కారణమని చెప్పారు.  ఫారెస్ట్ సర్వే ఆప్ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్టు వెల్లడయిందన్నారు.  కేంద్ర అటవీ శాఖా మంత్రి కూడా నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో,  చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నట్టు ప్రకటించారని...   ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారన్నారు. ఇదే స్పూర్తి మరికొంత కాలం సాగాలన్న సీఎం...హరిత లక్ష్యం సిద్ధించే  వరకూ అందరూ పట్టుబట్టి మొక్కలను నాటాలనీ, శ్రద్ధగా పెంచాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. 
అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్ కు ఎంతో పేరు వచ్చిందన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు, పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయని చెప్పారు. ఇంకా పలు ప్లైఓవర్లు, స్కై ఓవర్లు నిర్మాణదశలో ఉన్నాయని.. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించిందన్నారు. 
దుర్గం చెరువు బ్రిడ్జి నగర ప్రజలకు దూరాభారం తగ్గించడమే కాకుండా, సాయంకాలాలు జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతుందని.. హైదరాబాద్ నగరం అనంతంగా పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుకు అదనంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం  ప్రతిపాదించిందన్నారు. 

పీవీ మన ఠీవి
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు  దేశానికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. ప్రధానిగా భారతదేశ ఖ్యాతిని జగద్విదితం చేయడంలో పి.వి. చేపట్టిన విధానాలు, సంస్కరణలు సాటి లేనివి.  నేటి తరానికి ఆయన సేవలు గుర్తుండే విధంగా శ్రీ పి.వి. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం దేశ, విదేశాలలో ఘనంగా నిర్వహించింది.  హుస్సేన్ సాగర్ తీరంలో పి.వి. గారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు, ఆ రహదారికి “పి.వి.మార్గ్” గా నామకరణం చేసింది. శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించాలని శాసన సభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపిందని సీఎం కేసీఆర్ తెలిపారు.