బాధలన్నీ తీర్చినం

బాధలన్నీ తీర్చినం

మంచినీళ్లు, కరెంట్​, సాగునీళ్ల బాధ పోయింది
కరీంనగర్​ జిల్లా అమృతవర్షిణి అయింది.. ఇగ రాష్ట్రం కాశ్మీర ఖండమైతది: కేసీఆర్​
ఆరేండ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతాలు జరిగినయ్
గొర్రెలను చూసి ‘కేసీఆర్​ గొర్రెలు’అంటున్నరు..  నీళ్లను చూసి 
‘కేసీఆర్​ నీళ్లు’ అని సప్పట్లు కొడ్తున్నరు
కరోనాతో రూ. లక్ష కోట్లు నష్టపోయినం
జిల్లాకో మెడికల్​ కాలేజ్​ ఏర్పాటు చేస్తం
వేములవాడ ఆలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతం
సిరిసిల్ల పర్యటనలో సీఎం వెల్లడి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: తెలంగాణ వచ్చినంక బాధలన్నీ తీర్చామని, ఆరేండ్లలో వ్యవసాయరంగంలో అద్భుతాలు జరిగాయని, ఇక రాష్ట్రం కాశ్మీర ఖండమైతదని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘మిషన్​ భగీరథతో  మంచి నీళ్ల గోస తీర్చుకున్నం.. కరెంట్ బాధలు తీర్చుకున్నం.. సాగునీళ్ల బాధ  ఆల్​మోస్ట్​ పోయింది.. ఇకముందు పోతది’’ అని చెప్పారు. కరీంనగర్​ జిల్లా అమృతవర్షిణి  అయిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్​ ఆదివారం పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 1,320 డబుల్​ బెడ్రూం ఇండ్లు, ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ స్కూల్, సర్ధాపూర్​లో  ఏఏంసీ గోడౌన్లు, సిరిసిల్లలో రూ. 100 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్​ భవనాన్ని  ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు.
రైతులు వాపస్​ వస్తున్రు
‘‘కాకతీయ, రెడ్డి రాజులు చెరువుల రూపంలో మనకు అద్భుతమైన ఇరిగేషన్​ ఇచ్చిన్రు. అందుకే​తెలంగాణ వచ్చీరాంగనే మొట్టమొదట మనం మిషన్​కాకతీయ కింద చెరువులు బాగు చేసుకున్నం. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేసుకుంటున్నం” అని సీఎం అన్నారు. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయంటే అది కాళేశ్వరం , మిషన్​ కాకతీయ పుణ్యమేనని, వలస పోయిన రైతులంతా వాపస్​ వస్తున్నారని, ఎట్లయినా ఊళ్లళ్లనే ఉండాల్నని ఇండ్లు సదిరిపిచ్చుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి 92 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్​సీఐకి ఇచ్చామని, మిషన్​ కాకతీయ, కాళేశ్వరం నీళ్లతోనే ఇది సాధ్యమైందని సీఎం కేసీఆర్​ చెప్పారు. కాళేశ్వరం కరెంట్​ బిల్లు పదిహేను వేల కోట్లయినా కడ్తామని, రైతుల ఇండ్లు బంగారు వాసాలు కావాలని అన్నారు. 

కాళేశ్వరంపై మొదట్లో కొందరు ఎన్నో అనుమానాలు లేవనెత్తారని, ప్రాజెక్టు పనులు పూర్తయితయా? నీళ్లస్తయా అన్నట్లు మాట్లాడారని, కానీ అనుమానాలను పటాపంచలు చేసి కలను సాకారం చేసుకున్నామని సీఎం చెప్పారు. ‘‘తెలుగు టీవీలోళ్లు చెప్తలేరు గని మొన్న ఓ ఇంగ్లిష్​ టీవీల చూపెట్టిన్రు.. లిఫ్టింగ్​ ఎ  రివర్​, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు స్కీం అని మెచ్చుకున్నరు’’ అని తెలిపారు. కాళేశ్వరం దగ్గర 90 మీటర్ల నుంచి మిడ్​మానేర్​ వరకు 200 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్టు చేస్తున్నామని, ఈ మధ్యలోనే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామన్నారు.  భవిష్యత్​లో కరీంనగర్​ జిల్లా సజీవ జలధార అవుతుందని నాడు తాను చెబితే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు వాళ్ల కండ్ల ముందే కనిపిస్తోందని, కరీంనగర్​ జిల్లా అమృతవర్షిణి అయిందని పేర్కొన్నారు. అప్పర్​ మానేర్​ కూడా వేసవిలో మత్తడి దుంకుతుందని, చొప్పదండి లాంటి కరువు ప్రాంతాలు కాలువలతో కళకళలాడుతున్నాయన్నారు. సిరిసిల్ల మానేరుపై మరో 11 చెక్​ డ్యాంలకు వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో 180 కిలో మీటర్ల గోదావరి సజీవ జలధారగా మారిందన్నారు. దీంతోపాటు వరదకాలువను, కాకతీయ కాలువను సజీవ జలధారగా చేసుకున్నామని తెలిపారు. ‘‘వరద కాలువ రిజర్వాయర్ అయిత దని ఎవ్వలు అనుకోలే. ఇప్పుడు రిజర్వాయర్​అయింది. చెంబువట్టి నీళ్లు ముంచుకోవచ్చు. ఒగాయన చెప్పిండు.. రైతులు మోటర్లు వెట్టి కట్క ఒత్తితే ఐదు మీటర్ల దూరం నీళ్లు కొడ్తున్నయట.. వాటిని జూసి కేసీఆర్​ నీళ్లు అని సప్పట్లు కొడుతున్నరట’’ అని సీఎం పేర్కొన్నారు. ఒక్క పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కూడా కంప్లీట్​ అయితే రాష్ట్రమంతా సుభిక్షం అయితదని, రాష్ట్రం  కాశ్మీర ఖండమైతదని అన్నారు.  
జిల్లాకో మెడికల్ కాలేజ్​ మా లక్ష్యం
జిల్లాకో మెడికల్​ కాలేజ్​ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం కేసీఆర్​ చెప్పారు. రూ. 10 వేల కోట్లతో హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ఏర్పాటు  చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో పాటు ప్రతి జిల్లాకు 600  బెడ్స్​ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ వస్తుందన్నారు. సిరిసిల్లకు నర్సింగ్​ కాలేజీ వచ్చిందని, నర్సింగ్​ స్టూడెంట్లకు స్టయిఫండ్​ తక్కువగా ఉందని చెప్పడంతో పెంచుతున్నామని సీఎం ప్రకటించారు. మిడ్​ మానేర్​, అప్పర్​మానేర్​ ,అన్నపూర్ణ రిజర్వాయర్​కు టూరిజం ప్యాకేజీ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని కేసీఆర్​ హామీ ఇచ్చారు. మిడ్​ మానేర్​ వద్ద ఉన్న 243 ఎకరాల భూమి, అన్నపూర్ణ రిజర్వాయర్​ దగ్గర ఉన్న 240 ఎకరాల భూమిని మరో ఐలాండ్​ టూరిజం శాఖకు హ్యాండోవర్​ చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.  అప్పర్​ మానేర్​ కాలువల నిర్మాణం కోసం రూ. 50 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.  వేములవాడ ఆలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు.
కరోనా దయ్యంతో లక్ష కోట్లు నష్టపోయినం
కరోనా దయ్యం వల్ల రాష్ట్రం రూ. లక్ష కోట్లు నష్టపోయిందని సీఎం అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పల్లె, పట్టణ ప్రగతికి డబ్బులు ఆపడం లేదని చెప్పారు. సిరిసిల్లకు మెడికల్​ కాలేజీ వచ్చే ఏడాది మంజూరు చేస్తానని, ప్రస్తుతం ఇంజనీరింగ్​ కాలేజ్​ ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సిరిసిల్ల కార్గిల్​ లేక్​ నుంచి సర్ధాపూర్​ ఏఏంసీ గోడౌన్ల వరకు ఫోర్​ లేన్​ రోడ్డును నిర్మించాలని, నిధులు వెంటనే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్​, నిరంజన్​ రెడ్డి, పువ్వాడ అజయ్​, ప్రశాంత్​ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్​, సుంకె రవిశంకర్​, సీఎస్​ సోమేశ్​కుమార్​ పాల్గొన్నారు.
ఇంకా నయ్యం.. కేసీఆర్​ గొర్రె అంటలేరు
తాము చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీంతో రాష్ట్రంలో గొర్రెల సంపద విపరీతంగా పెరిగిందని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘ఊర్లల్లో పెద్ద సంఖ్యలో గొర్లు మోటర్లకు అడ్డం వస్తున్నయి.. వాళ్లు ఆపి, ఈ గొర్లన్నీ ఎక్కడియి అని అడిగితే కేసీఆర్​ గొర్లు అంటున్నరు. ఇంకా నయ్యం ‘కేసీఆర్​ గొర్రె’ అంటలేరు. ఇప్పటికే రూ.4 వేల కోట్లు గొర్రెల కోసం ఖర్చు పెట్టినం. మరో రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి రెండో విడత పంపిణీ చేపడ్తం’’ అని కేసీఆర్​ చెప్పారు. వివిధ వృత్తిదారులను  ఆదుకుంటున్నామని, సిరిసిల్ల నేతన్నల జీవనోపాధి కోసం బతుకమ్మ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇస్తున్నట్లే నేతన్నలు మరణిస్తే రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.  సిరిసిల్ల పద్మశాలీ భవన్​కు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన  ప్రకటించారు. అలాగే ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళిత జాతి అభివృద్ధి కోసం రాబోయే నాలుగేండ్లలో రూ.45 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నామన్నారు.