రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయొద్దు

రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయొద్దు
  • వడ్లన్నీ కేంద్రమే కొనేలా ఒత్తిడి పెంచాలె
  • మంత్రులతో సమావేశంలో సీఎం కేసీఆర్​ 
  • భవిష్యత్‌ కార్యాచరణపై నేడు మంత్రుల ప్రెస్‌మీట్‌

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో బీజేపీని రాజకీయంగా ఎదగకుండా జాగ్రత్త పడాలని మంత్రులకు సీఎం కేసీఆర్​ సూచించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేసేలా ప్రధాని నరేంద్రమోడీపై ఒత్తిడి పెంచుదామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌ను కలిసి వచ్చిన మంత్రులు నిరంజన్‌‌ రెడ్డి, గంగుల కమలాకర్‌‌, వేముల ప్రశాంత్‌‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌‌తో సీఎం కేసీఆర్‌‌ శుక్రవారం ప్రగతి భవన్‌‌లో భేటీ అయ్యారు. మధ్యాహ్నం మొదలైన సమావేశం రాత్రి 8.45 గంటల వరకు కొనసాగింది. పీయూష్‌‌ గోయల్‌‌తో భేటీ సందర్భంగా జరిగిన పరిణామాలను మంత్రులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత కేసీఆర్‌‌ ధాన్యం కొనుగోళ్లతో పాటు దేశంలో, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మాట్లాడినట్టు సమాచారం. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును నిరసిస్తూ పార్టీ రూపొందించిన యాక్షన్‌‌ ప్లాన్‌‌ను శనివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌‌లో ప్రెస్‌‌మీట్‌‌ పెట్టి మంత్రులు మీడియాకు వివరిస్తారని టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీ వాళ్ల కథ క్లోజ్​ అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని సీఎం కేసీఆర్​ అన్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణ విషయంలో  పీయూష్‌‌ గోయల్‌‌ మాట్లాడిన తీరు తెలంగాణను అవమానించేలా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ విషయంలో నోటికి వచ్చినట్టు మాట్లాడిన గోయల్‌‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పితీరుతామని ఆయన చెప్పినట్టు సమాచారం. కేంద్రం సేకరించదు కాబట్టే యాసంగిలో వడ్లే పండించొద్దని చెప్పినా, బీజేపీ రాష్ట్ర నేతలే రైతులను రెచ్చగొట్టారని, ఇప్పుడు టీవీల ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత కేంద్రం విధానాలపై ప్రజలకు వివరంగా చెప్తామనితెలిపారు. శనివారం నుంచి ఈ నెల 31 వరకు ప్రధాని నరేంద్రమోడీకి పెద్ద ఎత్తున లేఖలు రాసి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌‌ చేయాలన్నారు. దీనిపై ఆయా జిల్లాల మంత్రులు చొరవ తీసుకోవాలని కేసీఆర్​ సూచించారు. కేంద్రం తీరును ప్రజలకు వివరించేలా అనేక కార్యక్రమాలు చేపడదామని, ఢిల్లీలోనూ నిరసన తెలిపేందుకు సిద్ధమని అన్నారు.