50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రాసెస్​ స్టార్ట్​ చేయండి

50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రాసెస్​ స్టార్ట్​ చేయండి
  • సీఎంవో నుంచి నోట్​ రిలీజ్​
  • ప్రమోషన్ల తర్వాత ఏర్పడిన ఖాళీలు రెండో దశలో భర్తీ
  • ఖాళీలపై నివేదిక తయారు చేయాలని సూచన
  • అధికారుల రిపోర్టుపై ఈ నెల 13న కేబినెట్‌లో చర్చ
  • ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంపై ‘వీ6 - వెలుగు’లో ఇటీవల వరుస కథనాలు

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులు, ప్రతిపక్షాల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్​ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులతో పాటు అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేలు ఖాళీగా ఉన్నాయని, మొదటి దశలో వీటిని భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వటం ద్వారా ఏర్పడే ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారంతో నివేదికను తయారు చేయాలని,  ఈ నెల 13వ తేదీన కేబినెట్ మీటింగ్​కు తీసుకురావాలని ఆదేశించారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై కేసీఆర్​అధ్యక్షతన ప్రగతిభవన్​లో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తర్వాత సీఎంవో నోట్ రిలీజ్ చేసింది. రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం మాట్లాడుతూ.. కొత్త జోనల్ వ్యవస్థను కేంద్రం ఆమోదించకపోవడంతోనే ఇంతకాలం జాప్యం జరిగిందని  అందులో పేర్కొన్నారు. ‘‘గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ముందుగా ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులను భర్తీ చేస్తాం. అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాం. ప్రమోషన్ల ఇచ్చిన తర్వాత ఏర్పడ్డ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేస్తాం’’ అని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

13న రాష్ట్ర కేబినేట్ భేటీ
ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్​అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనున్నది.ఈ భేటీలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే మీటింగ్​లో ఉద్యోగాల భర్తీ అంశంపైనా చర్చించనున్నారు.

దిగొచ్చిన సర్కారు
ఉద్యోగాల భర్తీపై ఏడేండ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. నోటిఫికేషన్లు లేకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడే దుస్థితి తలెత్తింది. ఉద్యోగాలు భర్తీ చేయటం లేదనే ఆందోళనతో కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. పలుమార్లు మాట మార్చింది. 2018 ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని ఊరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్​లో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. ఎన్నికలయ్యాక సర్కారు మరిచిన విషయంపై ‘వీ6 వెలుగు’ వరుసగా స్టోరీలు ప్రచురించింది. నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బీజేవైఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీపై త్వరలోనే 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ వరుస ఆందోళనల కారణంగానే కేసీఆర్​ఉద్యోగాల భర్తీపై రివ్యూ చేసి.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.