చెప్పిన పంటనే పండించాలె..!

చెప్పిన పంటనే పండించాలె..!

డిమాండ్ ఉన్నవే సాగు చేయాలె: సీఎం కేసీఆర్
40 లక్షల టన్నుల కెపాసిటీతో గోదాములు నిర్మిస్తం
వానాకాలం పంటలకు ఎరువులు రెడీగ ఉన్నయి
రైతులు ఇప్పుడే కొనుక్కోవాలని సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతులంతా ఒకే పంట సాగు చేసే విధానం పోవాలని.. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్‌‌‌‌ ఉంటుందో దానిని సాగు చేయాలని సీఎం కేసీఆర్‌‌‌‌ చెప్పారు. ఎక్కడ ఏ పంట వేయాలనేవిషయం వ్యవసాయశాఖ నిర్ణ‌యిస్తుందని, రైతులంతా అవే పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రగతి భవన్‌లో యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లపై సీఎం మంగళవారం సమీక్షించారు. నియంత్రిత పద్ధతిలో పంటలు వేయాలని, నియంత్రిత పద్ధతిలోనే కొనుగోళ్లు జరగాలని..అవసరమైతే ఇందుకోసం చట్టంలో మార్పులు తేవడానికి సిద్ధంగాఉన్నామని చెప్పారు. ‘‘తెలంగాణ జీవనం వ్యవసాయానికి అనుబంధమై ఉంది. రాష్ట్రంలో 60–65 లక్షల మంది రైతులున్నరు. ఇంకా చానా మంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నరు. అసంఘటితంగా ఉండడం, గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయకపోవడంతో రైతులు వ్యథ అనుభవించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమం,- వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మెరుగైంది..ఇంకా కృషి జరగాల్సి ఉంది’’అని సీఎం పేర్కొన్నారు.

మూడు కోట్ల ఎకరాల్లో పంటలు

రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ప్రాజెక్టులను పూర్తిచేసుకోవడంతో 1,300 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం కలుగుతుంది. మిషన్‌ కాకతీయతో చెరువులు పునరుద్ధరించినం. 24గంటల ఫ్రీ కరెంట్‌‌‌‌తో సాగునీటి లభ్యత పెరిగింది. ప్రాజెక్టులు, చెరువులు, బోర్లకింద 1.45 కోట్ల ఎకరాల్లో రెండు పంటలు, పది లక్షల ఎకరాల్లో మూడో పంట పండే అవకాశముంది. ఈ లెక్కన ఏటా మూడు కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. రైస్‌‌‌‌బౌల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియాగా తెలంగాణ అవతరిస్తుంది. పంటలకు మద్దకు ధరిచ్చే వ్యూహాన్ని ఖరారు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు, రైతుబంధు సమితి ఈ దిశగా అడుగులు వేయాలి” అని సూచించారు. రాష్ట్రంలో పండే వరి, కందులు, శనగలు, పెసర్లు వంటి వాటిని సివిల్‌‌‌‌ సప్లయీస్‌‌‌‌ డిపార్ట్ మెంట్ కొనుగోలు చేయాలన్నారు. వాటిని ప్రాసెస్‌‌‌‌ చేసి ప్రజలకుఅందించాలని.. దీంతో రైతులకు మేలు కలగడంతో పాటు ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన ఆహారదినుసులు లభిస్తాయని చెప్పారు.

ఎరువులు రెడీ..

వానాకాలం పంటకు అవసరమైన 22.3 లక్షల టన్నుల ఎరువులు సకాలంలో రైతులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులు వాటిని మే నెలలోనే కొనుక్కొని నిల్వ చేసుకోవాలని.. ఒకేసారి దుకాణాల మీదపడొద్దని సూచించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు గత ఐదేండ్లలో 22.5 లక్షల టన్నుల కెపాసిటీతో గోదాములు నిర్మించిందని, మరో 40 లక్షల టన్నుల గోదాములు నిర్మించాల్సి ఉందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గోదాం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చే సంకల్పంతో ప్రభుత్వం రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిందని..ఆసమితులు క్రియాశీలం కావాలని కేసీఆర్ చెప్పారు. రైతుబంధు సమితులు ఏం చేయాలి, రైతులకు సహాయకారిగా ఎలా మారాలన్నదానిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. విత్తనోత్పత్తి చేసే రైతులు నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని సాగు చేయాలని సూచించారు. కల్తీ, నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మే వారిపై పీడీయాక్టు పెడతామనిహెచ్చరించారు.