దళిత బంధుకు లక్ష కోట్లయినా పెడ్తం

దళిత బంధుకు లక్ష కోట్లయినా పెడ్తం
  • రాష్ట్రంలో అర్హులందరికీ దశల వారీగా స్కీం: సీఎం కేసీఆర్
  • దళిత జాతిలో ఇక పేదలెవరూ మిగులొద్దు
  • వారి అభివృద్ధిని తెలంగాణ ఉద్యమంలా చేపట్టాలి
  • రాష్ట్ర ప్రభుత్వం గాంధీ, అంబేద్కర్​ ​బాటలో నడుస్తోందని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తమని సీఎం కేసీఆర్ ​ప్రకటించారు. దశలవారీగా అమలు చేసే ఈ స్కీం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సర్కార్​ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్​నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన సీఎం అక్కడున్న 20,929 దళిత కుటుంబాలకు స్కీం అమలు చేస్తామని, అందుకోసం రూ. 1500 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఈ నెల18న చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున పథకం అమలు చేస్తమని చెప్పగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దళితుందరికీ దశల వారీగా దళిత బంధు స్కీంను అమలు చేస్తమని ప్రకటించారు. 

సక్సెస్​ చేద్దాం.. కలిసి రండి

కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని కేసీఆర్‌‌ చెప్పారు.హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు తెలంగాణలోనే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం చేద్దామని దళిత ప్రజాప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం పిలుపునిచ్చారు. ఒకరి మీద ఒకరు పెట్టుకున్న కేసులను వాపస్ ​తీసుకోవాలని సూచించారు. దళిత జాతిలో ఎవ్వరూ పేదలుగా మిగలకూడదని సీఎం అన్నారు. 

దేశవ్యాప్తం కావాలి

తెలంగాణలో దళితబంధు విజయవంతం కోసం ప్రతి దళితబిడ్డ పట్టుబట్టి పనిచేయాలని, ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్​ పుట్టాలని సీఎం పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు, తెలంగాణ సహా, దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. రాజులు, జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములు, అనంతర వలస పాలకులు, ఇట్లా100 ఏండ్ల పాటు అనేక రకాల పీడను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నారని, అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని, తెలంగాణ ఒక గాడిలో పడిందని కేసీఆర్​అన్నారు. తెలంగాణ వస్తదా అన్నట్లుగానే దళిత బంధుపై కొందరు అనుమాన పడుతున్నారని, వారి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తామన్నారు. దళిత బంధును విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికే కాదు దేశ దళిత సమాజాభివృద్ధికి హుజూరాబాద్ దళితులు దారులు వేయాలన్నారు. అందుకు పునాది వేద్దామంటూ అక్కడున్న వారితో సీఎం ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రారంభించిన అనేక పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని దళిత బంధు పథకం కూడా దేశానికి ఆదర్శంగా మారుతుందన్నారు. ఎక్కడో ఒక దగ్గర ప్రేరణ కావాలని, అది హుజూరాబాద్ అవుతున్నందుకు ఆ గడ్డమీది బిడ్డలుగా మీరందరూ గర్వపడాలని సీఎం హుజురాబాద్​ నేతలతో అన్నారు.

పప్పులు.. పుట్నాలకు ఖర్చుపెట్టొద్దు

‘ఇన్నాళ్లూ ఏవేవో పథకాలు తెచ్చి ప్రభుత్వాలు బ్యాంకుల గ్యారెంటీ అడిగేవి. కాళ్లు చేతులే ఆస్తులుగా ఉన్న కడుపేద దళితులు గ్యారెంటీలు ఎక్కడ తెస్తరు? అందుకే దళిత బంధు పథకంతో ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం పూర్తి ఉచితం. ఇది అప్పుకాదు. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిన పైసలు పప్పులు పుట్నాలకు ఖర్చు చేయకుండా పైసను పెట్టి పైస సంపాదించే ఉపాధి వ్యాపారాలు చూస్కోవాలె.