
- ప్రభాకర్‌రెడ్డి మీద కాదు.. కేసీఆర్ మీద దాడి జరిగినట్టే!
- ఇంతమందిమి ఉన్నం.. తిక్క రేగితే దుమ్ము లేస్తదని ఫైర్
కామారెడ్డి/సంగారెడ్డి, వెలుగు: ఎన్నికల్లో గెలవడం చేతగాక కత్తులతో దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హత్యా రాజకీయాలను సహించబోమని హెచ్చరించారు. ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మీద జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో కత్తులతో దాడులు చేయడం, హింసకు పాల్పడడం కాంగ్రెస్‌కే చెల్లుతుందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ, సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్‌లలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ‘‘ప్రభాకర్‌రెడ్డి మీద జరిగిన దాడి కేవలం ఆయన మీద జరిగింది మాత్రమే కాదు. నా మీద జరిగినట్టే భావించాలి. కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంతమందిమి ఉన్నాం.. మాకు చేతులు లేవా? మాకు కత్తి దొరకదా? ఒకవేళ మాకు తిక్కరేగితే దుమ్ము దుమ్ము రేగుతది. తస్మాత్ జాగ్రత్త. 10 ఏండ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ మనం హింసకు దిగలే. ప్రజలు గెలిపిస్తే గెలిచినం. చేతనైన కాడికి సేవ చేసినం తప్పా దుర్మార్గమైన పనులు చేయలే. మా సహనాన్ని పరీక్షించవద్దు. ఈ దాడులు ఆపకపోతే.. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే.. మాకూ దమ్మున్నది. మేం కూడా అదే పని చేస్తే మీరెక్కడా మిగలరు. దుమ్ము కూడా మిగలదు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘బాధ్యతల్లో ఉన్నాం. ప్రజలు పదవులు ఇచ్చారని వారికి సేవలు చేయాలని అనుకుంటున్నం. కరెంటు, నీళ్లు, పంటలు కొనడం లాంటి పనులు చేసుకుంటున్నం. వాళ్లు దుర్మార్గమైన పనులు చేసుకుంటా ముందుకు పోతున్నరు. ఎజెండా చెప్పాలంటే ప్రజల ముందుకు రండి.. మీ వాదన చెప్పండి.. మా వాదన మేం చెబుతాం. ఎవరిని గెలిపిస్తే వారు పని చేయాలి. గూండాగిరీ వద్దు.. కత్తులు పట్టుకొని పొడుచుడు ఏంది?” అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘ విద్రోహులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలతో హింసను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ గూండాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.
డీకే శివకుమార్ సోయి లేకుండా మాట్లాడిండు
‘‘కర్నాటక, మహారాష్ట్రలో ఏమి జరుగుతున్నదో ఆ స్టేట్స్ పక్కన ఉన్న వాళ్లకు తెలుసు. మహారాష్ట్రలో రోజుకు 8 నుంచి 11 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కర్నాటకలో 24 గంటల కరెంట్ ఇస్తామని ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు 5 గంటలే ఇస్తున్నారు. కరెంట్ కోసం అక్కడి రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పక్కనే ఉన్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తెలంగాణలో సోయి లేకుండా మాట్లాడుతున్నరు” అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా చేస్తుంటే.. ఇక్కడికి వచ్చి కర్నాటక తరహాలో 5 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం సిగ్గులేని తనమన్నారు. ‘‘కనీస అవగాహన లేకుండా ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే దేంతో నవ్వాలో అర్థమైతలేదు. కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు జమీన్ – ఆస్మాన్ ఫరక్ ఉంది. తెలంగాణ ఇస్తామని 2004లో మాతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ మోసం చేసింది. గోస పెట్టి మరీ తెలంగాణ ఇచ్చింది. 2004లోనే తెలంగాణ వచ్చి ఉంటే.. ఇంకా బాగు పడేవాళ్లం. 10 ఏండ్లు ముందుకు పోయే వాళ్లం’’ అని చెప్పారు.
రైతుబంధు దుబారా అంటున్నరు
రైతుబంధు ఇవ్వడం దుబారా అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని కేసీఆర్ విమర్శించారు. ‘‘రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణాలను మాఫీ చేశాం. ఇంకా కొంత మందికి రుణమాఫీ కావాల్సి ఉంది. ఎన్నికలు కాగానే అవి కూడా మాఫీ అవుతాయి. విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్. నోరు కట్టుకొని అవినీతి రహితంగా, గొప్పగా పని చేశాం” అని చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు ఆగం చేస్తే పరేషాన్ కావద్దని చెప్పారు. బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సంగారెడ్డి జిల్లాలో 1.85 లక్షల ఎకరాలకు నీరందించి వ్యవసాయం సస్యశ్యామలం చేస్తామన్నారు. వందకు వందశాతం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘నేను కూడా రైతునే.. నాకూ వ్యవసాయం ఉంది. నా పొలంలో 25 బోర్లు వేసినా నీళ్లు రాలే. ఇట్లాంటి బాధలు అందరం అనుభవించినం. గత ప్రభుత్వాల పాలనలో చాలా మంది రైతులు అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చెరువులను బాగు చేశాం. ప్రాజెక్టుల ద్వారా ఇస్తున్నాం. బిందెలు పట్టుకొని పోయే గోస మిషన్ భగీరథ ద్వారా తీరింది” అని చెప్పుకొచ్చారు.