ఏం చేసిండని సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తుండు

ఏం చేసిండని సీఎం కేసీఆర్  మునుగోడుకు వస్తుండు

సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే మునుగోడులో అడుగుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగసభ ఉంటుందని ముందే చెప్పామని.. అయినా కుట్రపూరితంగా సీఎం కేసీఆర్ శనివారం సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. 

ఏం అభివృద్ధి చేశారు ? 
ఏం అభివృద్ధి చేశారని సీఎం మునుగోడుకు వస్తారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ నిధులు కేటాయిస్తున్నారని, మునుగోడు బై పోల్ వస్తుందనే కొత్త పెన్షన్ లు ఇస్తున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం అంటే సీఎంకు అంత చిన్న చూపు ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధికి పెట్టిన ఖర్చు, మునుగోడు డెవలప్మెంట్ కు పెట్టిన ఖర్చు వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ బందీ అయిందని.. ప్రస్తుతం విముక్తి కోరుకొంటోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుతరాలకోసం సరైన నిర్ణయం తీసుకొని ఉపఎన్నికలో కేసీఆర్ కి బుద్ది చెప్పాలని మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు

భూ నిర్వాసితుల సమస్య పరిష్కరించాలి...
భూ నిర్వాసితులు 6 సంవత్సరాలుగా పరిహారం కోసం తిరుగుతున్నా, నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కారు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివేక్ వెంకటస్వామితో కలిసి పోరాటం చేసి రాష్ట్ర సాధనలో ముందున్నామన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తీసుకుని మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్య రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.