స్కీమ్‌ లన్నింటికీ ఆన్‌ లైన్‌ లోనే అప్లికేషన్లు..ఇక పేపర్ దరఖాస్తులు బంద్

స్కీమ్‌ లన్నింటికీ ఆన్‌ లైన్‌ లోనే అప్లికేషన్లు..ఇక పేపర్ దరఖాస్తులు బంద్
  •     సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
  •     అర్హులందరూ అప్లై  చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్‌
  •     ప్రభుత్వ ఉద్యోగులు, అనర్హులను అప్లికేషన్​
  •     స్టేజ్‌లోనే ఏరివేసేలా ఏఐ టెక్నాలజీ
  •     అన్నింటికీ ఆధార్ నంబర్ , రేషన్ తప్పనిసరి
  •     కొత్త ఏడాదిలో ఆరు గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు
  •     అందుకు తగ్గట్టుగా వచ్చే  బడ్జెట్‌లో నిధుల పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఇక డిజిటలైజ్‌ కానున్నది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేపర్‌‌ దరఖాస్తులకు ప్రభుత్వం స్వస్తి పలకనున్నది. లబ్ధిదారులు చేతిలో కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురావాలని  సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇకపై ఏ చిన్న స్కీమ్‌కు అయినా పేపర్ దరఖాస్తులు తీసుకోవద్దని, అన్నింటినీ డిజిటలైజ్ చేయాలని భావిస్తున్నది. 

ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లబ్ధిదారుడికే నేరుగా స్కీమ్స్‌‌ అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీంతో పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని సర్కార్ అనుకుంటున్నది. 

అదే సమయంలో ఇటీవల కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పథకాల్లో లబ్ధి పొందుతున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే అనర్హులను దరఖాస్తు సమయంలోనే అడ్డుకోవడంతోపాటు అర్హులను మాత్రమే లబ్ధిదారుల జాబితాలో కొనసాగించేలా ఈ కొత్త విధానం ఉండబోతున్నది. ఈ ఏడాదిలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టాలని, ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే అమలవుతున్న స్కీమ్స్‌‌కు  మార్చి నుంచి  ఈ విధానంలోనే కొత్త అప్లికేషన్లు తీసుకునేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. 

పక్కా వివరాలతో ..

ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల్లో ‘స్మార్ట్’ గవర్నెన్స్‌‌ను అమలు చేయడమే లక్ష్యంగా ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్‌‌వేర్లను సిద్ధం చేయించాలని ప్లాన్ చేసింది. పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయం, సంక్షేమశాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అమలు చేస్తున్న స్కీమ్‌‌ల దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేయనున్నారు. 

అర్హులైన ప్రతి ఒక్కరూ సొంతంగా ఎక్కడి నుంచైనా, మీ-సేవా కేంద్రాల ద్వారా లేదా మొబైల్ యాప్‌‌ల ద్వారా అప్లై చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తారు. కేవలం దరఖాస్తు చేయడమే కాకుండా.. తన అప్లికేషన్ ఏ దశలో ఉందో ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలను సైతం పారదర్శకంగా తెలుసుకునే వీలుంటుందని సర్కారు భావిస్తున్నది. 

అప్లికేషన్‌‌లో ఆధార్ నంబర్, రేషన్ కార్డులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనున్నది. వాటితోనే వివరాలను ఆప్‌‌డేట్​ చేస్తారు.  అనర్హుల చేతుల్లోకి నిధులు వెళ్లకుండా ఉండాలంటే డేటా బేస్ పక్కాగా ఉండాలని అధికారులు నిర్ధారించారు. ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ దరఖాస్తులను ఏరివేసి, కేవలం నిజమైన పేదలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని కుటుంబ యూనిట్‌‌ను గుర్తిస్తారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్‌‌గా దాన్ని గుర్తించి.. రిజెక్షన్‌‌ లిస్ట్‌‌లోకి పంపేలా ఏఐ  సాంకేతికతను వినియోగించనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అనర్హులు అప్లికేషన్​ స్టేజ్‌‌లోనే ఆగిపోతారు. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం తగ్గి, నిధులు సద్వినియోగం అవుతాయని అంచనా వేస్తున్నారు.

డిపార్ట్‌‌మెంట్‌‌, స్కీమ్స్‌‌వారీగా వేర్వేరుగా ఉండేలా.. 

 గతంలో ఇచ్చిన ప్రజా పాలన దరఖాస్తులకు భిన్నంగా.. సాంకేతిక హంగులతో కూడిన కొత్త అప్లికేషన్లను తీసుకొనేలా ప్రభుత్వం ప్లాన్‌‌ చేస్తున్నది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆన్‌‌లైన్ ద్వారానే తమ వివరాలను నమోదు చేసేలా ఆయా శాఖలు సాఫ్ట్‌‌వేర్‌‌‌‌​ అప్​డేట్​ చేసి.. ఆయా శాఖల వెబ్​ పోర్టల్స్‌‌లో ఆప్షన్స్​ తీసుకురానున్నాయి.   

ప్రతీ పథకానికి  ప్రత్యేక కోడ్‌‌లో అప్లికేషన్​ నంబర్​ ఇస్తారు.  ఇలా ఆన్ లైన్ దరఖాస్తుల ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి, దానికి తగ్గట్టుగానే రాబోయే బడ్జెట్‌‌లో నిధుల కేటాయింపులు చేయాలని ప్రభుత్వం  భావిస్తున్నది. ఏ పథకానికి ఎంత మంది అర్హులున్నారు? ఎంత నిధులు అవసరమవుతాయి? అనే దానిపై ముందస్తుగా స్పష్టత రానున్నది.  ఇప్పటికే కోర్​ సిటీలో అన్ని సేవలు స్మార్ట్‌‌గా ఉండాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పథకాల విషయంలోనూ అదే పద్ధతిని అమలు చేసేలా ముందుకువెళ్తున్నది.