ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ .. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌గా హరీశ్‌కు బాధ్యతలు

ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ .. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌‌గా హరీశ్‌కు బాధ్యతలు
  • ఇక కృష్ణా జలాలపై చర్చ భారమంతా ఆయనపైనే.. 
  • ఒక్కరోజే సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ 
  • తోలుతీస్తానంటూ హెచ్చరించి.. కీలక సమయంలో జంప్ 
  • కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ..
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమైన సర్కార్

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా కృష్ణా జలాలపై పోరాడేందుకు ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానని సర్కార్‌‌ను హెచ్చరించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. మళ్లీ ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతుండగా.. ఇలాంటి కీలక సమయంలో చర్చల బాధ్యతను హరీశ్‌రావుకు అప్పగించి ఆయన మంగళవారం రాత్రే ఫామ్‌హౌస్ బాట పట్టారు. 

కేవలం ఒకే ఒక్క రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు రోజు హైదరాబాద్‌‌‌‌కు వచ్చిన ఆయన.. ఆ మర్నాడు (సోమవారం) అసెంబ్లీకి వెళ్లి సంతకం చేశారు. కాసేపు సభలో కూర్చుని నందినగర్‌‌‌‌‌‌‌‌లోని నివాసానికి చేరుకున్నారు. 

సోమ, మంగళవారాల్లో నందినగర్‌‌‌‌‌‌‌‌లో పార్టీ నేతలు, కార్యకర్తలను కలిశారు. మంగళవారం సాయంత్రం కేటీఆర్, హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, పల్లా రాజేశ్వర్​రెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ క్రమంలో హరీశ్​రావును డిప్యూటీ ఫ్లోర్​లీడర్‌‌‌‌‌‌‌‌గా నియమించిన కేసీఆర్.. కృష్ణా జలాలపై చర్చల బాధ్యతను ఆయనకు అప్పగించి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు వెళ్లిపోయారు. 

కాగా, చాలా రోజుల తర్వాత ఫామ్‌‌‌‌హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై పోరాడతానని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో ఏపీతో జరిగిన కీలక ఒప్పందాలు, ఏపీకి అనుకూలంగా పలు సందర్భాల్లో కేసీఆర్​చేసిన వ్యాఖ్యలు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అన్ని ఆధారాలతో అసెంబ్లీలో పవర్​పాయింట్​ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ తీరా సభలో చర్చలు జరగనున్న టైమ్‌‌‌‌లో కేసీఆర్ తిరిగి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు వెళ్లిపోవడం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చర్చనీయాంశమైంది.

 
హరీశ్‌‌‌‌పైనే భారం.. 

కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండేండ్లు పూర్తయింది. ఈ రెండేండ్లలో ఏడుసార్లు అసెంబ్లీ సెషన్ నిర్వహించగా.. కేవలం మూడుసార్లే కేసీఆర్​సభకు వచ్చారు. స్పీకర్​ముందు ప్రమాణ స్వీకారం చేసిన రోజు, నిరుడు బడ్జెట్​పెట్టినప్పుడు, తాజాగా ఇప్పుడు వచ్చి వెళ్లారు. ఈ రెండేండ్లలో పార్టీ ఫ్లోర్​లీడర్​లేకుండానే బీఆర్ఎస్​లీడర్లు సభకు హాజరయ్యారు. ఇన్ని రోజులు కనీసం డిప్యూటీ ఫ్లోర్​లీడర్లను కూడా నియమించలేదు.

 తాజాగా ఇప్పుడే ఇటు అసెంబ్లీ, అటు మండలికి డిప్యూటీ ఫ్లోర్​లీడర్లను కేసీఆర్ నియమించడానికి కారణం నీళ్ల అంశంపై చర్చేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కృష్ణా నీళ్లలో తప్పెవరిదో చర్చించేందుకు కేసీఆర్​అసెంబ్లీకి రావాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్​సహా అధికార పక్ష నేతలు సవాల్​విసిరారు.

 అయితే, కేసీఆర్​సభకు వస్తే బీఆర్ఎస్​హయాంలో చేసిన తప్పులు బయటపడతాయన్న ఉద్దేశంతోనే హరీశ్​రావును ముందుకు నెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మచ్చ తనపై పడకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్​తప్పుకున్నారని చర్చ నడుస్తున్నది. మరోవైపు డిప్యూటీ ఫ్లోర్​లీడర్‌‌‌‌‌‌‌‌గా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కాకుండా హరీశ్​రావును నియమించడం వెనుక కారణం కూడా ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.