వెల్కమ్ 2026..నిర్మల్ లో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించిన ప్రజలు

వెల్కమ్ 2026..నిర్మల్ లో  కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించిన ప్రజలు
  • అర్ధరాత్రి వరకు సంబురాలు.. భారీగా దావత్ లు
  • మందు పార్టీలతో పెరిగిన మద్యం కొనుగోళ్లు
  • ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

నిర్మల్, వెలుగు:  అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు, లాభనష్టాలతో ముగిసిపోయిన 2025 సంవత్సరానికి ప్రజలంతా వీడ్కోలు పలికి 2026కు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. యువత బుధవారం ఉదయం నుంచే దావత్ ల ఏర్పాట్లలో బిజీగా మారిపోయారు. ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని, అనుకున్న పనులన్నీ పూర్తికావాలని, గత సంవత్సరం లో చోటుచేసుకున్న చేదు సంఘటనలను మరిపించేలా కొత్త ఏడాది అందరికీ మంచి చేసి మురి పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

 కిటకిటలాడిన లిక్కర్, నాన్ వెజ్ షాపులు 

దుకాణాల్లో కొనుగోల్లు పెద్ద ఎత్తున పెరిగాయి. మధ్యాహ్నం నుంచి మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరి కనిపించారు. మటన్, చికెన్ సెంటర్ ల వద్ద కూడా జనం కిటకిటలాడారు. ప్రధాన రెస్టారెంట్ల ముందు ఏర్పాటు చేసిన నాన్ వెజ్ వంటకాల టెంట్లన్నీ జనంతో నిండిపోయాయి. న్యూ ఇయర్​ను పురస్కరించుకొని బేకరీల యజమానులు కేక్ లపై భారీ ఆఫర్లు పెట్టారు. కొనేందుకు జనాలు ఎగబడ్డారు.

 ఆలయాల వద్ద భారీగా ఏర్పాట్లు

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని జనం ఆలయాలకు పోటెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బాసర సరస్వతి దేవి ఆలయం, జిల్లాలోని కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర తదితర ఆలయాల వద్ద నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.