బీసీలకు టికెట్ల విషయంలో .. సీఎం కేసీఆర్​ క్లారిటీ ఇవ్వాలి : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

బీసీలకు టికెట్ల విషయంలో ..  సీఎం కేసీఆర్​ క్లారిటీ ఇవ్వాలి :  ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

పెద్దపల్లి, వెలుగు: బీసీల టికెట్ల విషయంలో జరుగుతున్న చర్చకు బీఆర్ఎస్​ మంత్రులు క్లారిటీ ఇస్తే సరిపోదని, సీఎం కేసీఆర్​ ముందుకొచ్చి చెప్పాలని బీఎస్పీ చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్​ మాట్లాడారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలకు కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారన్నారు. 

ఎంబీసీల కార్పొరేషన్ కు బడ్జెట్ లో రూ.2,433 కోట్లు కేటాయించి కేవలం రూ. 7 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు.99 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కుల, చేతి వృత్తులకు, మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నామన్నారు. పేదలకు గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, కల్యాణలక్ష్మి సంక్షేమ పథకాలను ప్రకటించి కల్వకుంట్ల కుటుంబం మాత్రం లక్షల కోట్లను దోచుకుంటోందదని ఆరోపించారు. 

బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్ఎస్​పీ యాత్ర పెద్దపల్లి జిల్లలోని  కాచాపూర్, వడ్కాపూర్, కుమ్మరి కుంట, జూలపల్లి, పెద్దాపూర్ లో కొనసాగింది. బీఎస్పీ నాయకులు దాసరి హనుమయ్య,  దాసరి ఉష, గొట్టే రాజు, తోట వెంకటేశ్​పటేల్ జోనల్, బొంకురి దుర్గయ్య,  నార్ల గోపాల్ యాదవ్, సతూరి అనిల్, ఎండీ రియాజ్, కుమ్మరి సవిత,  బాల కళ్యాణ్ పంజా, మొలుమూరి  చంద్రశేఖర్ పాల్గొన్నారు.