
కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన పటారం.. లోన లొటారం.. చెప్పేది డంబాచారం అనేలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్పష్టత ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నానుస్తోందని మండిపడ్డారు. నీటి పంపకాలు జరపాలని 150 దరఖాస్తులు రాసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. నీటి వాటా గురించే ఇన్నేళ్లు సమయం తీసుకుంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు . మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజీలో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ‘‘ మక్తల్, కొడంగల్, నారాయణపేట్ వైపు వెళ్లే కాల్వలను త్వరలో ప్రారంభించుకోబోతున్నం. జిల్లాలో 25 నుంచి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండే రోజులు దూరంలో లేవు’’ అని కేసీఆర్ తెలిపారు. చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే దాదాపు రూ.3.50 లక్షల కోట్లు నష్ట పోయిందన్నారు. Frbm మీద కోతలు పెట్టి తెలంగాణ ప్రగతిని అడ్డుకోవాలని కేంద్రం చూస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి యావత్ దేశం ఆకర్షితమవుతోందని చెప్పారు . కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రజలు, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రజలు తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలుపమని కోరుతున్నరని కేసీఆర్ ఈసందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో రాష్ట్ర బడ్జెట్ విలువ కేవలం 65వేల కోట్లు ..ఇప్పుడది 2.50 లక్షల కోట్లని కేసీఆర్ పేర్కొన్నారు. దీక్షా దక్షతతో పరిపాలనా చేయబట్టే బడ్జెట్ ఆ స్థాయికి పెరిగిందని చెప్పారు. మహబూబ్ నగర్ లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రేపే జీవో జారీ చేస్తమని సీఎం ప్రకటించారు. పాలనా వికేంద్రీకరణ సంస్కరణల అమలులో భాగంగా అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు.పాలమూరు జిల్లాకు ఐటీ సెంటర్, 300 ఎకరాల్లో ఫుడ్ పార్క్, 2000 ఎకరాల్లో అర్బన్ పార్క్, 9500 కోట్లతో బ్యాటరీ ఫ్యాక్టరీ రావడం సంతోషకరమన్నారు. ‘‘హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది.. ఇంతకుముందు ఇరుకు రోడ్డు ఉండేది.. ఇప్పుడు 4 లేన్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది ’’ అని కేసీఆర్ చెప్పారు. ‘‘పాలమూరు జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినం. ఇప్పటికే మూడు ప్రారంభమయినై. మిగిలినవి కూడా త్వరలోనే ప్రారంభమవుతయి’’ అని తెలిపారు.