మోడీ సేల్స్ మేన్‌లా వ్యవహరించిండు

మోడీ సేల్స్  మేన్‌లా వ్యవహరించిండు

ప్రధాని నరేంద్ర మోడీ వల్ల దేశం పరువు పోతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. శ్రీలంకలో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు జరుగుతున్నాయో.. రేపటి బీజేపీ సభలో చెప్పాలని సవాల్ విసిరారు. శ్రీలంక విషయంలో మోడీ సేల్స్ మేన్‌లా వ్యవహరించారని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ఓ అబద్ధం అని, మోడీ పాలనలో ఏం ఒరిగిందని ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలతో ఎవరూ సంతోషంగా లేరన్నారు. హైదరాబాద్ జలవిహార్ లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. యశ్వంత్ సిన్హాకు అన్ని రంగాల్లో అనుభవం ఉందన్నారు. లాయర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆర్థికమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. విదేశాంగశాఖ మంత్రిగా పలు అవార్డులు అందుకున్నారని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మనస్సాక్షిని అనుసరించి ఓట్లు వేయాలని కోరారు.

యశ్వంత్ సిన్హా గెలుపుతో  దేశ గౌరవం పెరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో వ్యవస్థలు సరిగా పని చేయడం లేదని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు వస్తున్న మోడీ తమకు వ్యతిరేకంగా చాలా చెబుతారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా తమకు వచ్చే నష్టం ఏం లేదన్నారు. ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలన్నారు. రైతులను ఉగ్రవాదులు, ఖలిస్తాన్ లు అంటూ అవమానించారని, వారిపై కార్లు ఎక్కించారని ఆరోపించారు.

రైతులకు పరిహారం ఇస్తే ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. మోడీ తప్పుడు నిర్ణయాాల వల్ల 700 మంది రైతుల ప్రాణాలు పోతే కూడా ఆయనకు బాధ లేదన్నారు. ఎన్నికలుంటే తియ్యగా మాట్లాడుతారని.. ఎన్నికలయ్యాక అన్నీ అబద్ధాలు చెబుతారన్నారు. తామే పర్మినెంట్ అనే భ్రమలో మోడీ ఉన్నారని అన్నారు. రాజకీయ మార్పు తప్పకుండా జరుగుతుందన్నారు. మోడీ పాలనతో దేశానికి ఏం ఒరిగిందని ప్రశ్నించారు.  ఇప్పుడు ఏం చెబుతారో చెప్పి వెళ్లండి... కానీ ఇకపై ఇది నడవబోదని మోడీని హెచ్చరించారు.