
- అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలకు సీఎం హెచ్చరిక
- మనకు నేలవిడిచి సాము చేసుడు అలవాటైంది
- 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్త
- బతిమాలి చెప్తే కొన్నిసార్లు వినరు.. అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు
- నేనూ ఓ జిల్లాను దత్తత తీసుకుంట.. అభివృద్ధి ఎందుకు జరగదో చూస్త
- గ్రామ సభలు నిర్వహించకపోతే సర్పంచ్‌నైనా సస్పెండ్ చేయాలని ఆదేశం
నేల విడిచి సాము చేయడం మనకు అలవాటైంది. మన పక్కన్నే చేయాల్సినంత పని ఉంది. అది వదిలి ఎక్కన్నో ఏదో చేయాలనుకోవడం సరికాదు. ఆరునెల్లపాటు కష్టపడండి. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ధి కావో చూద్దాం. నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంట. అదనపు కలెక్టర్, నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం.
హైదరాబాద్, వెలుగు: పల్లె, పట్టణ ప్రగతి అమలు ఆశించిన స్థాయిలో లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు (డీపీవోలు) కష్టపడి పనిచేస్తున్నారని, కానీ గ్రౌండ్ లెవల్ నుంచి వస్తున్న రిపోర్టులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని, అందుకే పదేపదే చెప్పాల్సి వస్తోందని అన్నారు. ‘‘మీకు కావాల్సినంత టైం ఇచ్చిన తర్వాతనే నేను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించిన. చెప్పకపోతే నాది తప్పు. ఇంత చెప్పినంక కూడా ఇంకా ఎవరైనా అదనపు కలెక్టర్లు, డీపీవోలు పనితీరును మెరుగుపరుచుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకుండా, అలసత్వం వహించినట్లు నా తనిఖీల సందర్భంగా తేలితే ఎవరు చెప్పినా వినను. క్షమించే ప్రసక్తే లేదు. తక్షణమే కఠిన చర్యలుంటయ్” అని ఆయన హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతిపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో సమీక్షించారు. ఇన్నాళ్లూ కావాల్సినంత సమయం ఇచ్చానని, ఇక తానే రంగంలోకి దిగుతున్నానని సీఎం చెప్పారు. ముందు ఒకసారి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశానన్నారు. తన ఆకస్మిక తనిఖీలకు ఇంకో పది రోజులు ఉందని, ఆలోగా తప్పుల్ని దిద్దుకోకుంటే క్షమించేది లేదని హెచ్చరించారు. గ్రామ సభలు నిర్వహించకపోతే టీఆర్‌ఎస్ సర్పంచ్‌నైనా సస్పెండ్ చేయాలని, గ్రామ కార్యదర్శులపైనా వేటు వేయాలని ఆదేశించారు.
ఒక్కో అడిషనల్ కలెక్టర్‌కు రూ. 25 లక్షలు
అధికారులకు నేల విడిచి సాము చేయడం అలవాటైందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా ప్రోత్సహించినా నిర్దేశించిన బాధ్యతలు నెరవేర్చకపోవడం నేరమన్నారు. మన పక్కనే చేయడానికి ఎంతో పని ఉన్నా, ఎక్కడో ఏదో చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆరు నెలలు కష్టపడితే గ్రామాలు, పట్టణాలు ఎలా అభివృద్ధి కావో చూస్తానన్నారు. అందరూ ఈ పనిని యజ్ఞంలా భావించాలని, తాను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని, అక్కడి అడిషనల్ కలెక్టర్‌తో కలిసి పనిచేస్తానని, అభివృద్ధి ఎందుకు జరగదో చూస్తానని సీఎం పేర్కొన్నారు. అత్యవసర పనులకు అడిషనల్ కలెక్టర్లు నిధులు మంజూరు చేయడానికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున కేటాయిస్తున్నామని తెలిపారు.
వినకపోతే నర్సింహావతారం ఎత్తక తప్పదు
కింది స్థాయి ఉద్యోగులకు, సర్పంచులకు తెలియని విషయాలు నేర్పిస్తూ గ్రామాల అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలని అడిషనల్ కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు. మొదటి దశలో మంచిగ చెప్పి చూడాలని, వినకుంటే కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘‘నయమున ప్రాలుందాగరు, భయమున విషమైన భుజింతురు.. అని అంటరు. బతిమాలి చెప్తే కొన్నిసార్లు వినరు, అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు’’ అని తేల్చిచెప్పారు. గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని, కొందరు అధికారులను సెలెక్ట్ చేసి అక్కడికి స్టడీకి పంపాలని ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మనం అమలు చేస్తున్నామని, తెలియని విషయాలు తెలుసుకోవడానికి అహంభావం అవసరం లేదన్నారు.
20, 21న ఆకస్మిక తనిఖీలు
పల్లె, పట్టణ ప్రగతి అమలు తీరును పరిశీలించడానికి ఈనెల 20, 21 తేదీల్లో జిల్లాల పర్యటనకు వస్తున్నానని సీఎం చెప్పారు. 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. వరంగల్ టూర్‌లో కలెక్టరేట్‌ను ప్రారంభిస్తామని, జైలు ఆవరణలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేస్తానని తెలిపారు.
సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్
గ్రామ సభలు నిర్వహించి, ఆర్థిక నివేదికల మీద చర్చలు జరిగేలా చూడాల్సిన బాధ్యత డీపీవోలదేనని కేసీఆర్ చెప్పారు. పల్లె ప్రకృతి వనాలకు ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ నిధుల నుంచి ప్రైవేటు భూమి కొనాలని ఆదేశించారు. డీపీవో, డీఎల్పీవోలు గ్రామీణాభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని, ఎంపీడీవోలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ‘‘సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్’’ అని పిలుపునిచ్చారు. పనితీరు బాగలేని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత కూడా మారకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మూడేండ్లలో మలేరియా ఫ్రీ తెలంగాణ
సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడేండ్లు కష్టపడితే శ్రీలంక తరహాలో మలేరియా రహిత తెలంగాణ అవతరిస్తుందని ఆఫీసర్లు అన్నారు. సీఎం మాట్లాడుతూ.. సీజన్ ప్రారంభానికి ముందే పంచాయతీరాజ్, మున్సిపల్, హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు రివ్యూ నిర్వహించి సీజనల్ వ్యాధులను అరికట్టే చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్‌లు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో మొక్కలు నాటడంపై ఎఫ్‌ఆర్వోలు సర్టిఫై చేయాలని, మున్సిపల్, పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులకు అవగాహన తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని అంశాలపై ప్రతి పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలన్నారు. వెజ్, నాజ్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం సికింద్రాబాద్ మోండా మార్కెట్, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించాలని సూచించారు.
లే ఔట్ల విషయంలో జాగ్రత్త
పట్టణాల్లో వేసే లే ఔట్ల విషయంలో అడిషనల్ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లే ఔట్లలో కమ్యూనిటీ హాల్, ట్రాన్స్‌ఫార్మర్, సబ్ స్టేషన్స్, వాటర్ ట్యాంకర్ ఇతర అవసరాల కోసం కేటాయించాల్సిన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకుంటున్నారని, వాటిని ముందే మున్సిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌లో డైనమిక్ అప్డేషన్ చేయాలన్నారు. ప్రజల అవసరాల కోసం ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్రామాల్లో తిరిగితే సమస్యలు తెలుస్తయ్
అధికారులు నిర్భయంగా, బాధ్యతతో పనిచేస్తే వారి వెంట తాను ఉంటానని, ఎవరు ఒత్తిడి చేస్తున్నా వినకుండా సమర్థంగా పనిచేయాలని సీఎం సూచించారు. అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేసి.. పొద్దున జనంలో తిరగాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో కష్టాలు తెలుస్తాయన్నారు. అడిషనల్ కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించేందుకు కొత్త వాహనాలు అందజేస్తున్నామని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతికి క్రమం తప్పకుండా నిధులిస్తున్నామని చెప్పారు. అన్ని వనరులు, ఉద్యోగులు సరిపడా ఉన్నారని, ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పర్సనల్ అప్రైజల్ రిపోర్ట్ ద్వారా అధికారుల పనితీరు రికార్డు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంటే భర్తీ చేసే అధికారం కలెక్టర్‌కు ఇచ్చానన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆఫీస్ పక్కనే అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని పెంచుతామన్నారు. గ్రామాలు, పట్టణా ల్లో మొక్కలు నాటడం మొదలు పెట్టిన 15 రోజుల్లోగా ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిగ పనిచేసిన వారిని గుర్తించి అవార్డులు, రివార్డులు అందజేయా లన్నారు. వైకుంఠధామాలకు గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలోని ఆఫీసుల పరిశుభ్రత బాధ్యతను సర్పంచ్, పట్టణాల్లో మున్సిపల్ పాలకవర్గం తీసుకోవాలన్నారు.
సర్పంచులు ఇతర సిబ్బందితో ముందు ప్రేమగా ఉండండి..
మంచిగ చెప్పండి.. అభిమానంతో పనిచేయించుకోండి. వినలేదనుకో కొంచెం కఠినంగా మారండి. ఎందుకంటే ‘నయమున ప్రాలుందాగరు, భయమున విషమైన భుజింతురు’ అని అంటరు. అంటే మంచిగా నిమ్మలంగా బతిమాలి చెప్తే కూడా కొన్ని కొన్ని సార్లు వినరు.. అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు.
దవాఖాన బిల్డింగ్ మీద హెలిప్యాడ్ కట్టాలె
వరంగల్‌లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్‌గా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ‘‘అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్ల కోసం దవాఖాన బిల్డింగ్ మీదనే హెలికాప్టర్ దిగే విధంగా హెలిప్యాడ్‌ను నిర్మించాలి. కెనడా మోడల్లో, గాలి వెలుతురు బాగా వచ్చేలా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పిటల్ నిర్మాణం ఉండాలి. దీని కోసం కెనడాలో పర్యటించి రావాలి’’ అని ఆఫీసర్లకు సూచించారు.
అడిషనల్ కలెక్టర్లకు కియా కార్నివాల్ కార్లు
అడిషనల్ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కియా కార్నివాల్ కార్లు అందజేసింది. పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష చేస్తున్న సమయంలో మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ సోమేశ్ కుమార్ 32 కార్లను జెండా ఊపి ప్రారంభించారు. వాటిని సీఎం కేసీఆర్ పరిశీలించారు.