నేడు వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

నేడు వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అక్కడ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వనపర్తిలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌ వేదికగా ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, వనపర్తి పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

అటు.. నాగవరంలో మెడికల్‌ కాలేజీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్‌ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరగనున్న బహిరంగ సమావేశంలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.