గృహలక్ష్మికి ఎక్కువ రూల్స్ వద్దు!

గృహలక్ష్మికి ఎక్కువ రూల్స్ వద్దు!

హైదరాబాద్, వెలుగు: సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన గృహలక్ష్మి స్కీమ్ లో ఎక్కువ రూల్స్ పెట్టొద్దని మంత్రులతో సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి అందజేసిన గైడ్ లైన్స్ లో పలు మార్పులు చేయాలని మంత్రులకు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ పథకం గైడ్ లైన్స్ ను ఫైనల్ చేసే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు సీఎం అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలకు ఇబ్బందిగా ఉండే గైడ్ లైన్స్ పెడితే ఎన్నికల ముందు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నందునే ఇబ్బంది లేకుండా ఉండేలా రూల్స్ మార్చాలని సీఎం చెప్పినట్లు చర్చ జరుగుతోంది.   

ప్రతిపాదించిన రూల్స్ ఇవీ.. 

సొంత జాగాలో ఇండ్ల స్కీమ్ కు సంబంధించి హౌసింగ్ ఉన్నతాధికారులు గత ఏడాది జూన్ లో ప్రభుత్వానికి గైడ్ లైన్స్ అందజేశారు. వీటిని హౌసింగ్ మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించి పలు మార్పులు చేయాలని సూచించారు. తిరిగి మళ్లీ గైడ్ లైన్స్ అందజేశారు. వీటిని సీఎం కేసీఆర్ పరిశీలించి, ఫైనల్ చేస్తారని అధికారులతో మంత్రి చెప్పారు. అయితే, ఈ గైడ్ లైన్స్ పై ఇంత వరకు సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ రివ్యూ చేయలేదని తెలుస్తోంది. అధికారులు అందజేసిన గైడ్ లైన్స్ ప్రకారం రూరల్ లో కనీసం 50 గజాలు, అర్బన్ లో 75 గజాల సొంత జాగా ఉండాలని రూల్స్ పెట్టారు. నాలుగు సార్లు రూ.70 వేల చొప్పున రూ.3 లక్షలను ఇంటి నిర్మాణం ఆధారంగా ఇవ్వాలని ప్రతిపాదించారు. జాగా ఉన్న లబ్ధిదారులను ముందుగా గ్రామ పంచాయతీ సెక్రటరీ, అర్బన్ లో మున్సిపల్, కార్పొరేషన్​ అధికారులు గుర్తించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ఎక్కువ ఉన్నందున ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేసి జాగా ముందు లబ్ధిదారుడు ఫొటో దిగి అప్ లోడ్ చేస్తే అవకతవకలకు అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు. 

జాగా.. లబ్ధిదారుల ఇష్టం 

అధికారులు ఖరారు చేసిన గైడ్ లైన్స్ లో జాగాపై సీఎం పలు సవరణలు చేయాలని సూచించారు. రూరల్, అర్బన్ లో కనీస జాగా ఉండాలన్న నిబంధనను తొలగించాలని సీఎం అన్నట్లు సమాచారం. జాగా ఎంత అన్నది లబ్ధిదారులకే వదిలేయాలని మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. ఇక లబ్ధిదారులకు 4 సార్లు క్యాష్ ఇవ్వాలన్న ప్రతిపాదనను 3 సార్లకు తగ్గించారు. మహిళల పేరు మీదే ఇండ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించి, ఈ స్కీమ్ కు గృహలక్ష్మి అని పేరు పెట్టారు. లబ్ధిదారులను సైతం ఎమ్మెల్యేలు, కలెక్టర్లే ఫైనల్ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఇవ్వనున్నారు. ఒక్కో ఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నారు. ఇక ఈ స్కీమ్ కు ఇటీవల బడ్జెట్ లో ప్రభుత్వం రూ.12 వేల కోట్లు  కేటాయించింది. అయితే, పీఎం ఆవాస్ యోజన ద్వారా ఈ స్కీమ్ కు రూరల్ లో రూ.72 వేలు, అర్బన్ లో  రూ.1.50 లక్షలు రానున్నట్లు తెలుస్తోంది. 


జూన్ 2లోగా స్కీమ్ ప్రారంభం? 


గైడ్ లైన్స్ ను ఖరారు చేసే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు అప్పగించినప్పటికీ, ఈ స్కీమ్ పై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు హౌసింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి హరీశ్ రావు చైర్మన్ గా, హౌసింగ్, పంచాయతీ రాజ్, మున్సిపల్ మంత్రులను సభ్యులుగా ఈ కమిటీలో నియమించే అవకాశాలు ఉన్నాయి. గైడ్ లైన్స్ బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించడంతో హౌసింగ్ అధికారులు మంత్రిని అపాయింట్ మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు విషయంలో మంత్రులు బిజీగా ఉన్నందున త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ స్కీమ్ గైడ్ లైన్స్ త్వరగా ఫైనల్ చేసి జూన్ 2లోగా స్కీమ్ ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.