ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ రేపు ఉత్తర ప్రదేశ్ కు వెళ్లనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ములాయం పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. ఈ విషయాన్ని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.  అనారోగ్య సమస్యలతో  ఇవాళ ఉదయం కన్నుమూసిన ములాయం సింగ్‌ అంత్యక్రియలను అక్టోబ‌ర్ 11న ఆయ‌న స్వగ్రామం సాయ్‌ఫాయ్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించ‌నున్నారు.  

ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి మూడుసార్లు సీఎంగా, కేంద్రమంత్రిగా జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం పని చేశారని కేసీఆర్ కొనియాడారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు.  ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.