అమరుల యాదిలో అఖండ జ్యోతి..జూన్ 22న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

అమరుల యాదిలో అఖండ జ్యోతి..జూన్ 22న  ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • ప్రతిష్ఠాత్మకంగా అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం
  • ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ నిర్మాణం

భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్‌, పైభాగంలో ఎరుపు-పసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతి. ఇదీ తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక అమరవీరుల స్మారకచిహ్నం. హైదరాబాద్‌ నడిబొడ్డున.. ఓ వైపు హుస్సేన్‌సాగర్‌, మరోవైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి మధ్యలో దీన్ని నిర్మించారు. ఈ నెల 22న ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ స్మారకానికి రూ.177.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అతుకులు లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో నిర్మితం కావటం దీని ప్రత్యేకత.

ఎన్నో విశేషాలు

3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం లోపల ఓ మ్యూజియంతోపాటు సుమారు 100మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో-విజువల్‌ హాలు, 650 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్‌ సెంటర్‌, పర్యాటకుల కోసం ఓ రెస్టారెంట్‌తోపాటు ఇతర సౌకర్యాలు, 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్‌ సౌకర్యం ఉన్నది. భవనం నిర్మాణ వైశాల్యం(బిల్టప్‌-ఏరియా) 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్‌సాగర్‌ అందాలు, బుద్ధవిగ్రహం, బిర్లామందిర్‌, అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు వీక్షించేందుకు వీలుగా టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారకం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ఫినిషింగ్‌ పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.