ఇవాళ కుటుంబ సమేతంగా యాదాద్రి వెళ్ళనున్న కేసీఆర్

ఇవాళ కుటుంబ సమేతంగా యాదాద్రి వెళ్ళనున్న కేసీఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ వైభవంగా కొనసాగుతోంది. బాలాలయంలో 7వ రోజు పంచ కుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంతిపాఠం, చతుః స్థానార్చన, మూల మంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి జరుగనున్నాయి. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారయాణం, మూలమంత్ర హావనములు, చతుః స్థానార్చనలు, షోడశ కళాన్యాస హోమములు, పంచశయ్యధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

ప్రధానాలయం పునః నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు అనుమతిచ్చారు. ప్రధానాలయం పునః నిర్మాణం పూర్తవడంతో ఈరోజుతో బాలాలయంలో దర్శనాలు ముగియనున్నాయి. రేపు జరగబోయే యాదాద్రి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణ జరగనుంది. తర్వాతా సాయంత్రం 4గంటల నుంచి భక్తులకు స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలకు అనుమతించనున్నారు. 

ఈ రోజు రాత్రి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకోనున్నారు.  రేపు జరిగే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 12వందల 80 కోట్ల ప్రభుత్వ నిధులతో యాదాద్రిని పునః నిర్మించారు సీఎం కేసీఆర్. 2015లో పునః నిర్మాణాన్ని మొదలు పెట్టగా ఇటీవలే నిర్మాణం పూర్తైంది.

అద్భుత శైలిలో యాదాద్రిని పునః నిర్మించారు శిల్పులు. ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ నిర్మాణ శైలులను ఉపయోగించారు. 17 వందల అడుగుల పొడవు.. 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు.  84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహా రాజగోపురం నిర్మించారు. మహారాజగోపురం పూర్తవడానికి రెండేళ్లు పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. అంతే కాకుండా భారీ రాతి శిల్పాలను నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాద మహర్షి, రామానుజుల రూపాలను చూడవచ్చు. అంతే కాకుండా గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్ పై గర్భాలయ ఉత్సవ మూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.