ఇవాళ ( సెప్టెంబర్15న) 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ ( సెప్టెంబర్15న)  9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్‌‌‌‌ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియెట్ లేదా ప్రగతి భవన్‌‌ నుంచి వర్చువల్‌‌గా ఈ కాలేజీలను ప్రారంభించనున్నారు. మంత్రి హరీశ్‌‌రావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తదితరులు సీఎం వెంట ఉండనున్నారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేశారు. 

ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కాలేజీల్లో ఉండి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌, సూపరింటెండెంట్లకు మంత్రి హరీశ్‌‌రావు ఇదివరకే పలు సూచనలు చేశారు. స్టూడెంట్లు అందరూ సీఎం స్పీచ్‌‌ను వినేలా కాలేజీల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలేజీల ఓపెనింగ్‌‌ను పండగలా నిర్వహించాలన్నారు. 

రాష్ట్రంలో పోయినేడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 9 కాలేజీలను ప్రారంభిస్తోంది. ఒక్కో కాలేజీలో వంద సీట్ల చొప్పున 900 ఎంబీబీఎస్ సీట్లు ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే స్టూడెంట్లు కూడా కాలేజీల్లో చేరిపోయారు. ఇవిగాక మరో 8 కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే అకడమిక్ ఇయర్ నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.