రేపే ఫుల్ బడ్జెట్

రేపే ఫుల్ బడ్జెట్
  • ‘ఓటాన్​ అకౌంట్’​తో పోలిస్తే తగ్గుదల?
  • లక్షా 70 వేల కోట్లకే పరిమితమయ్యే చాన్స్
  • కొత్త పథకాలు లేవు.. ఉన్న వాటికీ కటకటే

హైదరాబాద్, వెలుగు: 2019–20 వార్షిక బడ్జెట్ ను సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ పద్దు తగ్గనుంది. 1.81 లక్షల కోట్లతో మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 1.70 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర ఆదాయంపై మాంద్యం ప్రభావం ఇప్పటికైతే లేదని.. అయితే భవిష్యత్ లో ఎఫెక్ట్ ఉంటుందని, అందుకే బడ్జెట్ ను కుదించారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోఇరిగేషన్ కు రూ.22,500 కోట్లు కేటాయించారు. ఈసారి రూ.20 వేల కోట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది. బడ్జెట్ కసరత్తు కోసం 24 మంది జూనియర్ ట్రాన్స్ లేటర్లను,14 మంది సెక్షన్ రైటర్లను ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించింది.

పెన్షన్లు అందుతయా?

సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుల్లో కోత ఉండకపోవచ్చు. కానీ నిధుల విడుదలలో మాత్రం జాప్యం ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నెల ఆసరా పెన్షన్ల కోసం రూ.850 కోట్లు అవసరం. రెండు నెలలుగా పెన్షన్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇక నుంచి రెండు నెలలకోసారి పెన్షన్ ఇస్తారనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఆసరా పెన్షన్ వయస్సును 57 ఏళ్లకు కుదించి, అమలు చేస్తే మరో  రూ.200 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. దీంతో ఇప్పట్లో ‘తగ్గింపు’ అమలు చేయకపోవచ్చు. రైతుబంధుకు సంబంధించి ఇప్పటికే రూ.2,500 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మాఫీ, భృతి పరిస్థితేంటి?

ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లో రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీని 4 విడుతలుగా అమలు చేస్తామని సీఎం చెప్పారు. కానీ ఇంకా విధివిధానాలు తయారు కాలేదు. నిరుద్యోగ భృతి కోసం రూ.1,810 కోట్లు పక్కకుపెట్టారు. కానీ దానిపై ఇంతవరకు కసరత్తు  జరగలేదు. ఎవరు నిరుద్యోగులు, ఎప్పట్నించి అమలు చేస్తారనేది క్లారిటీలేదు.

పీఆర్సీ ఇస్తారా? ఇయ్యరా?

పీఆర్సీ కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. గత ఏడాది జులై 1 నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాలి. పీఆర్సీ సిఫారసులను కూడా కమిటీ సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వం తీసుకోవడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశాలు లేవని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. ఒక్క శాతం ఫిట్​మెంట్ ఇస్తేనే ఖజానాపై ఏడాదికి  రూ.200 కోట్ల భారం పడునుంది. ఏపీ తరహాలో ఇక్కడ 27 శాతం ఫిట్​మెంట్ ప్రకటిస్తే ఏటా అదనంగా రూ.5,400 కోట్ల భారం పడుతుంది.

రెండున్నర లక్షల కోట్లు దాటిన అప్పులు

ఏపీ విభజన తర్వాత రాష్ట్రంలో రూ.1,764 కోట్ల రెవెన్యూ మిగులు ఉండేది. కానీ పరిస్థితి మారింది. అప్పులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం, వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణం రెండున్నర లక్షల కోట్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ10,325 కోట్ల అప్పు తీసుకున్నారు.

మండలిలో ఎవరు?

ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను శాసన మండలిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశ పెట్టారు. ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారా, లేదా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ మధ్య ఈటల చేసిన కామెంట్స్ పార్టీలో దుమారం రేపాయి. అప్పటి నుంచి ముఖ్యమంత్రిని ఈటల నేరుగా కలవలేదు. మండలిలో ఎవరు బడ్జెట్ ప్రవేశ పెడుతారనేది ఆసక్తిగా మారింది.

12 సభా కమిటీలు

శాసనసభ, మండలి సభ్యులతో సభా కమిటీలను నియమించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 12 కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీకి చైర్మన్, 7 మంది నుంచి 10 మంది సభ్యులు ఉండనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, సభ్యుల సదుపాయాల కమిటీ, ఎథిక్స్ కమిటీలతో పాటు మరికొన్ని నియమించనున్నారు. కమిటీల చైర్మన్లు, సభ్యులను అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్‌‌ ప్రకటిస్తారు. మరోవైపు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సంప్రదాయంగా ఉంది. ఇప్పడు కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా లేకపోవడంతో ఎవరికి ఆ పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. సభలో టీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. దీంతో మజ్జిస్​సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాలు 8 లేదా 9 రోజులు?

అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11.30కు పూర్తిస్థాయి బడ్జెట్​ను సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతారు. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను కేసీఆర్ సమర్పించారు. ఆర్థిక శాఖ తన వద్దే ఉండటంతో రెండోసారి కూడా ఆయనే ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. వెంటనే సభ ఎజెండా ఖరారు కోసం బీఏసీ సమావేశం కానుంది. స్పీకర్ నేతృత్వంలో జరిగే భేటీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలో ఫైనల్ చేయనున్నారు. 8 లేదా 9 రోజులు సభ జరిపే యోచనలో ప్రభుత్వం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతి రోజే మొహరం కావడంతో సెలవు ఇవ్వనున్నారు. 11న సమావేశాలు ఉంటాయా లేదా అనే దానిపై అనుమానాలున్నాయి. 12న గణేశ్ నిమజ్జనం ఉంది. దీంతో వరసగా మూడు రోజులు సభకు సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 13వ తేదీ నుంచి 21 వరకు సమావేశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే  ప్రభుత్వం 23వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించే చాన్స్ ఉంది.   24న స్పీకర్ దక్షిణాఫ్రికా పర్యటన ఉండటంతో ఆలోపు సభ వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ బిల్లు పెడుతానని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ బిల్లుపై ఎలాంటి కసరత్తు చేయలేదని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

CM KCR will introduce the Annual budget of 2019-20 on Monday