కేసీఆర్ పాలనా సంస్కారం ఇదేనా?

కేసీఆర్ పాలనా సంస్కారం ఇదేనా?

తెలంగాణలో స్వేచ్ఛను కేసీఆర్ కూనీ చేస్తున్నారని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా సాయంపల్లిలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. అయితే రచ్చబండ కార్యక్రమానికి అనుమతిలేదంటున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అటు జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు రేవంత్. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయకుండా నిర్భందకాండకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు ప్రగతిభవన్, ఫాంహౌస్‌లు బద్దలైపోతాయన్నారు. కేసీఆర్ సర్కార్ కావాలనే కాంగ్రెస్ కార్యక్రమాలను అడ్డుకుంటుందన్నారు. రాష్ట్రమంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని.. వంతుకు వంతు లెక్క చెప్పాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు రేవంత్.

రాష్ట్రమనుకుంటున్నారా? ప్రైవేట్ ఎస్టేట్ అనుకుంటున్నారా?

అర్ధ రాత్రి నుంచి పోలీసులతో ఇంటిని ముట్టడించడం… అనుమతి లేకుండా ఇంటి లోపలికి చొరబడటం… పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం… ఇదేనా కేసీఆర్ పాలనా సంస్కారం అంటూ ప్రశ్నించారు రేవంత్. తెలంగాణ భారత రాజ్యాంగ పరిధిలో రాష్ట్రమనుకుంటున్నారా.. లేదా ప్రైవేటు ఎస్టేట్ అనుకుంటున్నారా అని మండిపడ్డారు. రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా అంటూ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్ కు.. రైతుల చావుకేకలు వినపడటం లేదా అని ప్రశ్నించారు. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళ్తారు కానీ… పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా అడిగారు రేవంత్.