- యాసంగి వడ్లన్నీ మీరే కొనాలె
- ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లెటర్
- రాష్ట్రాలకు వేర్వేరు విధానాలు ఉండొద్దు
- ధాన్యం సేకరణకు జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలి
- అప్పుడే రాష్ట్రాలు, రైతులకు అన్యాయం జరగదు
- ఇందుకోసం సీఎంలు, ఎక్స్‌పర్ట్స్‌తో మీటింగ్ పెట్టాలని వినతి
హైదరాబాద్, వెలుగు: రబీలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆహార సంస్థకు ఆదేశాలివ్వాలని కోరుతూ బుధవారం ఓ లెటర్ రాశారు. ఆహార ధాన్యాల సేకరణ కోసం దేశమంతటా ఒకే విధానం ఉండాలని, దీనికోసం ప్రత్యేక చట్టం ఉండాల్సిన అవసరం ఉందని అందులో సూచించారు. దేశంలో ఉండే వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు విధానాలు ఉండకూడదన్నారు. జాతీయ స్థాయిలో ధాన్యం సేకరణకు ఒకే విధానం ఉంటేనే రాష్ట్రాలకు, రైతులకు జరిగే అన్యాయాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాలా శ్రేయస్కరమైన పాలసీని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో అలా ఎందుకు చేయడంలేదు
పంజాబ్, హరియానా లాంటి రాష్ట్రాల్లో పండే మొత్తం వరి, గోధుమలను సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణలో మాత్రం అలా చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించడంతో పంటల విస్తీర్ణం పెరిగిందని, ప్రతీ వరి గింజను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని నొక్కిచెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని 2013లో రూపొందించుకున్నప్పుడు ధాన్యం సేకరణ, ఆహార భద్రత బాధ్యతలను కేంద్రానికి అప్పజెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ శాఖ కీలకమైనదని, ఒకవైపు వనరులను సమకూర్చడం మాత్రమే కాక వివిధ రకాల ఉత్పత్తులకు వినియోగదారుగా కూడా ఉన్నదని, సగం జనాభా ఈ రంగంపై ఆధారపడే బతుకుతున్నారని కేసీఆర్ చెప్పారు. రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆ రంగానికి, దేశ ప్రగతికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యతరేక చట్టాలను తీసుకొచ్చిన తర్వాత రైతుల ఆందోళనకు కేంద్రం తలొంచక తప్పలేదని, చివరకు ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
ప్రతీ గింజను కొనే బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దురదృష్టవశాత్తూ రెండేండ్లుగా వరి సేకరణలో కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తీరు నిరుత్సాహకరంగా ఉన్నదని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేస్తున్నా.. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించకపోతే ఆ నిర్ణయానికి అర్థమే ఉండదన్నారు. ఆహార భద్రత, మద్దతు ధర అమలు బాధ్యత కేంద్రానిదేనని ఆయన గుర్తుచేశారు. రైతులను పంటల మార్పిడి దిశగా తెలంగాణ ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నదని, 2021 రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈసారి అది 36 లక్షల ఎకరాలకు తగ్గిందని చెప్పారు. పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల విధానం ఒక్కసారిగా రైతుల్లో మార్పు తీసుకురావడానికి వీలు పడదని, క్రమంగా అలవాటయ్యేంత వరకు వరి ధాన్యాన్ని కూడా కేంద్రం పూర్తి స్థాయిలో సేకరించాల్సి ఉంటుందని, ఆ బాధ్యతను గుర్తుచేయాల్సి వస్తున్నదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
