కమీషన్లు వచ్చే విషయాల మీదే సీఎం కేసీఆర్​ దృష్టి

కమీషన్లు వచ్చే విషయాల మీదే సీఎం కేసీఆర్​ దృష్టి

కామారెడ్డి, వెలుగు: ధరణి పోర్టల్​తో రైతులు నానా కష్టాలు పడుతుంటే వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని, ప్రజల సమస్యలను పక్కన బెట్టి.. కమీషన్లు వచ్చే విషయాలమీదే సీఎం కేసీఆర్​ దృష్టి పెడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. విలువైన భూములను ప్రొహిబిటెడ్​ లిస్టులో  పెట్టి ధరణితో కల్వకుంట్ల ఫ్యామిలీ భూ దందా సాగిస్తున్నదని ఆయన ఆరోపించారు. ‘‘హైదరాబాద్​ చుట్టూ ఉన్న విలువైన భూములను ప్రొహిబిటెడ్​లిస్ట్​లో పెట్టారు.  కమీషన్​ ఇచ్చి.. సగం ల్యాండ్​ఇచ్చి సెటిల్​మెంట్ చేసుకుంటే ఆ భూములను ప్రొహిబిటెడ్​ లిస్ట్​నుంచి తొలగిస్తున్నారు. ధరణికి వ్యతిరేకంగా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత  బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. పార్టీ స్టేట్​ ప్రెసిడెంట్​తో చర్చించి కార్యాచరణ చేపడతాం” అని ప్రకటించారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని, కామారెడ్డిలో భూదందాపై కలెక్టర్  స్పందించాలన్న డిమాండ్​తో బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జ్​ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. బుధవారం రెండో రోజుదీక్షకు వివేక్​ వెంకటస్వామి సంఘీభావం తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార ఉన్నారు. వెంకటరమణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివేక్​ వెంకటస్వామి పరిశీలించి.. బీపీ చెక్​ చేశారు.  ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలతో, మీడియాతో  మాట్లాడారు. అసైన్డ్​, పేద రైతుల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్​తో  రైతులను  రాష్ట్ర సర్కార్​ ఇబ్బందులకు గురిచేస్తున్నదని, బిడ్డల పెండ్లికి భూములు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం, మిషన్​ భగీరథలో అవినీతి సొమ్ము అయిపోవటంతో ధరణి అవినీతికి తెరలేపారని ఆరోపించారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని, ఇదే మోడల్ ఢిల్లీలో అమలు చేయాలని ప్రయత్నించి  కేసీఆర్​ ఫ్యామిలీ లిక్కర్​ స్కామ్ లో ఇరుక్కుందని వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఈ స్కామ్​పై ఈడీ ఎంక్వైరీ చేస్తున్నదని తెలిపారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్​ బీఆర్​ఎస్​ స్థాపించాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. హెచ్​సీఏ ప్రెసిడెంట్​గా కవితను చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నించారని,  కేటీఆర్​ గేమ్​ఆడి అజరుద్దీన్​ను  ప్రెసిడెంట్​ చేశారన్నారు.  మునుగోడులో ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని, అక్కడ బీజేపీ గెలుపు ఖాయమని వివేక్​ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. 

వెంకటరమణారెడ్డికి ఏం జరిగినా సర్కారుదే బాధ్యత: రవీందర్​రెడ్డి

ధరణితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్ష చేస్తున్న  బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డికి  ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిఉంటుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్​రెడ్డి అన్నారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా వైస్​ ప్రెసిడెంట్​ ఆకుల భరత్​,  జనరల్ సెక్ర టరీ తేలు శ్రీనివాస్​, మున్సిపల్ ఫ్లోర్​ లీడర్​ మోటూరి శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు.  కాగా, ధరణి సమస్యలు పరిష్కరించాలంటూ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష  చేపట్టగా.. మంగళవారం ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. సాయంత్రం ఇంట్లో వదిలారు.  ఆయన ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. బుధవారం రెండో రోజు దీక్షకు బీజేపీ లీడర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు, రైతులు  మద్దతు తెలిపారు.